నాగార్జునకు స్పెషల్‌గా.. హరికృష్ణకు బాధగా.. హాట్ టాపిక్ అయిన చంద్రబాబు ట్వీట్స్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై సోషల్ మీడియా ద్వారానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అదే సమయంలో సామాజిక, రాజకీయ, ఇతర అంశాలపైనా స్పందిస్తున్నారు. ఇక, ప్రముఖులకు సంబంధించిన ప్రత్యేకమైన రోజుల విషయంలోనూ ఆయన ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఒకే రోజు ఇద్దరు సినీ సెలెబ్రిటీలపై చంద్రబాబు ట్వీట్ చేశారు.
చంద్రబాబు బావ మరిది, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ గత సంవత్సరం ఇదే రోజున రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్‌లో 'ఎన్టీఆర్ ఆదర్శాల బాటలో నడిచి ప్రజాబంధువుగా, సౌమ్యుడిగా ప్రజల హృదయాలలో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్న కీర్తిశేషులు హరికృష్ణగారు. ఆ మంచిమనిషి మనకు దూరమై ఏడాది గడిచినా మన మధ్యలోనే ఉన్నారనిపిస్తోంది. ఈరోజు హరికృష్ణగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మీయ స్మృతులను స్మరించుకుందాం' అని ట్వీట్ చేశారు.

అలాగే, ఇదే రోజున టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున 60వ పుట్టినరోజు. దీంతో ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో నాగార్జున పేరు మారుమ్రోగిపోతోంది. అందుకే ట్విట్టర్‌లో 'హ్యాపీ బర్త్‌డే నాగ్' అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ఇదిలాఉండగా, చంద్రబాబు కూడా తన ట్విట్టర్‌లో 'ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న నాగార్జున గారికి శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని భగవంతుడిని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











