రామ్ చరణ్ ‘జంజీర్/తుఫాన్’ రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' రిలీజ్ డేట్ ఖరారైంది. ఈచిత్రాన్ని సెప్టెంబర్ 06, 2013లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు.
వాస్తవానికి ఈచిత్రం వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్ర నిర్మాతలు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించిన లీగల్ సమస్యలు ఓ కొలిక్కి రావడంతో సినిమాను సెప్టెంబర్ 06న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ముంబై నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి నిర్మాతలు మారినట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్ర నిర్మాతగా ఉన్న అమిత్ మెహ్రా నుంచి ఈ చిత్రాన్ని ఆయన సోదరులు సుమీత్, పునీత్‌లు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగినట్లే అంటున్నారు.
1973లో వచ్చిన 'జంజీర్' చిత్రం ఒరిజినల్ వెర్షన్‌ను ప్రకాష్ మెహ్రా 'ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్' బేనర్ పై నిర్మించారు. అతని పెద్ద కుమారుడైన అమిత్ మెహ్రాకు సంబంధించిన అడయ్ మెహ్రా ప్రొడక్షన్స్ ప్రై.లి రామ్ చరణ్ హీరోగా జంజీర్ చిత్రాన్ని రీమేక్ చేసింది. దీంతో అమిత్ సోదరులైన సుమీత్, పునీత్ రంగంలోకి దిగారు.
తమ అనుమతి లేకుండా సినిమాను రీమేక్ చేసారని, తమ తండ్రిగారు నిర్మించిన ఆ సినిమాపై తమకూ హక్కులు ఉన్నాయని కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో అమిత్ వారిద్దరికి తగిన మొత్తం చెల్లించడంలో విఫలం అయ్యారు. చివరకు జరిగిన సెటిల్మెంట్‌లో ఈ చిత్రం హక్కులు సుమీత్, పునీత్‌లు దక్కించుకున్నారు. త్వరలో వీరే రామ్ చరణ్ నటించిన జంజీర్ చిత్రాన్ని 'ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్' బేనర్‌పై, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా విడుదల చేయబోతున్నారు.
వివాదం కొలిక్కి రావడంతో ఈచిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేసేందుకు దర్శకుడు అపూర్వ లఖియా ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషించారు.


Click it and Unblock the Notifications











