చరణ్-రాజమౌళి సినిమా ఆలస్యం కావచ్చు?
రామ్ చరణ్ రెండో సినిమా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రానున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్ఎస్ రాజమౌళి-జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ ఇచ్చిన విజయం కిక్ నుంచి రాజమౌళి ఇంకా బయటకు రానట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన ప్రేమను చూపే రాజమౌళి మళ్లీ ఎన్టీఆర్ తో నే సినిమా తీస్తే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా పౌరాణిక నేపథ్యాన్ని కలిగి ఉంటుందని అనుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దసరా రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే కంత్రి సినిమా పూర్తయ్యేలోగా ఎన్టీఆర్ కోసం చక్కని కథను రూపొందించుకోవాలని రాజమౌళి అనుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ భొగట్టా. ఎన్టీఆర్ జోష్ లో ఉన్న రాజమౌళి రామ్ చరణ్ సినిమాకు ఇపుడు పనిచేస్తాడా అన్నది కొంచెం అనుమానమే. అయితే చిరుత ప్రిమియర్ షో చూసిన వెంటనే మీడియాతో మాట్లాడిన రాజమౌళి రామ్ చకణ్ చక్కగా చేశాడని తాను కూడా మాస్ సినిమానే తీస్తానని చెప్పాడు. మరి ఆయన రామ్ చరణ్ సినిమాకు పని చేస్తాడా లేక జూనియర్ ఎన్టీఆర్ కోసం పౌరాణిక స్క్రిప్ట్ రూపొందించే పనిలో పడతాడా అన్నది రాజమౌళి చెబితేనే తెలుస్తుంది.


Click it and Unblock the Notifications