'చార్మి..నీకేమైనా పిచ్చా' అన్నా సరే...
నా శ్రేయోభిలాషులందరూ 'చార్మి..నీకేమైనా పిచ్చా' అని తిట్టారు. కానీ అవేమీ లక్ష్యపెట్టకుండా ఆ సినిమా చేశా. పైగా ఆ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు జరిగింది. పాత్ర నచ్చడంతో అవేమీ పట్టించుకోలేదు అంటూ చార్మి తన 'అనుకోకుండా ఒకరోజు' చిత్రం చేసిన రోజులు గుర్తుకు తెచ్చుకుంటోంది. ఆమె పరిశ్రమకు వచ్చి ఈ నెల 27కి తొమ్మిదేళ్లు నిండుతున్నాయి. ఈ విషయాన్ని చెపుతూ మీడియా దగ్గర గతాన్ని తవ్వుతోంది చార్మి. అలాగే 'అనుకోకుండా ఒకరోజు' సినిమా టైమ్‌లో ఆ సినిమాకంటే ముందు మూడు సినిమాలకు సైన్ చేశాను. తర్వాత గుణ్ణం గంగరాజు 'అనుకోకుండా ఒకరోజు' కథ చెప్పడంతో..అప్పటికే సైన్ చేసిన మూడు సినిమాలను వదిలేశా. చివరకు ఆ సినిమా నాకు ఒక్క తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా గుర్తింపు తెచ్చిపెట్టింది. అందుకే పాత్ర నచ్చితే...అందులో నటనకు ఆస్కారం ఉంటే..అస్సలు డబ్బు గురించి ఆలోచించను నేను. ఇప్పటికీ నేను ఆ పద్థతి మార్చుకోలేదు అంది. ఇక గతాన్ని గుర్తు చేసుకోవటం తప్ప చార్మికి ప్రస్తుతం వేరే పనేమీ కనపడటం లేదు. ఆమె నటించిన సయ్యాట, మాయగాడు చిత్రాలు చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. అలాగే ఆమె హీరోయిన్ గా మంత్ర దర్శకుడు తులసీ రామ్ దర్శకత్వంలో ప్రారంభమయిన మంగళ కూడా షూటింగ్ జరగటం లేదని వినికిడి.


Click it and Unblock the Notifications











