బన్నీ రికార్డు బద్దలు కొట్టిన చెర్రీ: బాహుబలి తర్వాత రంగస్థలమే..
Recommended Video

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు దూరమవుతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారన్న చర్చ తెరపైకి వచ్చింది. అందుకు సమాధానంగా.. బన్నీ-చెర్రీ పేర్లు మాత్రమే బలంగా వినిపించాయి. ఒకరకంగా భవిష్యత్తులోనూ ఆ స్థానం కోసం వీరిద్దరి మధ్య బలమైన పోటీ తప్పదనేలా ఈ చర్చ సాగుతోంది. ఇలాంటి తరుణంలో.. బన్నీ రికార్డును చెర్రీ బద్దలు కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది..

ఏంటా రికార్డు:
వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య'. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన 'ఫస్ట్ ఇంపాక్ట్' విడుదల చేశారు. బన్నీని హైఓల్టేజీతో చూపించిన ఆ టీజర్.. విడుదలైన 29గంటల్లో కోటి వ్యూస్ దక్కించుకుంది. 'బాహుబలి' తర్వాత ఆ ఘనత సాధించిన సినిమాగా రెండో స్థానంలో నిలిచింది.

బన్నీని కొట్టేసిన చెర్రీ..:
ఇక బుధవారం సాయంత్రం చెర్రీ రంగస్థలం టీజర్ కూడా యూట్యూబ్ లో విడుదలైంది. ఈ టీజర్ 25.5గంటల్లో కోటి వ్యూస్ దక్కించుకోవడం విశేషం. దీంతో బన్నీ రికార్డును చెర్రీ బద్దలు కొట్టినట్లయింది. బాహుబలి తర్వాత ఇప్పుడు రంగస్థలం సినిమా రెండో స్థానంలో నిలవగా.. అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' మూడో స్థానంలో నిలిచింది.

రిపబ్లిక్ డే పోస్టర్:
రికార్డుల సంగతి పక్కనపెడితే.. రిపబ్లిక్ డే రోజున అటు చెర్రీ, ఇటు బన్నీ ఇద్దరూ అభిమానులను అలరించారు. సిట్టిబాబు(చెర్రీ) తన ఎడమ చేతిలో కోడి పుంజుని పట్టుకుని, కుడి చేతితో జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న ఒక పోస్టర్‌ను రంగస్థలం టీమ్ విడుదల చేసింది. ఈ పోస్టర్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

నా పేరు సూర్య సాంగ్..:
మరోవైపు దేశ సైనికులకు ట్రిబ్యూట్ గా అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' చిత్ర యూనిట్ ఓ పాటను నేడు విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవ వేళ సైనికుల కష్టాలను, వారి దేశభక్తిని చాటిచెప్పేలా ఈ సాంగ్ ఉంది. విశాల్-శేఖర్ ద్వయం అందించిన మ్యూజిక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రంగస్థలంపై భారీ అంచనాలు:
రాంచరణ్ రంగస్థలం మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. రాంచరణ్ కెరీర్ లో ఇదో విభిన్న పాత్ర కావడం.. 1980ల నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ దీన్ని తెరకెక్కిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

'నా పేరు సూర్య'పై అప్పుడే పాజిటివ్ బజ్
ఇక బన్నీ 'నా పేరు సూర్య' ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. సరిహద్దులో దేశం కోసం పనిచేసే ఓ సైనికుడి దేశభక్తి నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు వక్కంతం వంశీ సినిమాను తీర్చిదిద్దుతున్న విధానం ఇప్పటికే క్యురియాసిటీని పెంచేసింది. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకాన్ని 'ఫస్ట్ ఇంపాక్ట్' తోనే కలిగించాడు.


Click it and Unblock the Notifications











