రవితేజ 'కిక్' రీమేక్ స్క్రిప్టు గురించి ఛేతన్ భగత్
న్యూఢిల్లీ: రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో వచ్చి విజయం సాధించిన 'కిక్' చిత్రాన్ని హిందీలో పునర్నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల రచయిత ఛేతన్ భగత్ స్రీన్ ప్లే రాయిస్తున్నారు. ఈ సినిమాకు 'కిక్' అనే పేరు పెట్టాలనే యోచనలో నిర్మాణ సంస్థ ఉన్నట్లు సమాచారం. ఈ రీమేక్ లో సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ దబాంగ్ లో హీరోయిన్ గా చేసిన సోనాక్షి సిన్హా ఆయనకు జోడీగా చేయనుంది.
ఈ చిత్రం స్క్రిప్టు గురించి చేతన్ భగత్ మాట్లాడుతూ... సల్లూభాయ్ అభిమానులకు 'కిక్'ఇచ్చే స్క్రిప్ట్ రాస్తున్నానని చెబుతున్నాడు . ఇక చిత్ర కథ గురించి చెబుతూ.. కిక్కు కోసం ఏదైనా చేసే ఓ యువకుడి పాత్రలో సల్మాన్‌ఖాన్ కనిపించనున్నారు. అలాంటి హీరో ఇమేజ్‌ను మరింత పెంచేలా స్క్రిప్ట్ ఉండాలి అన్నారు.
అలాగే ...బాలీవుడ్ అభిమానుల్లో నా నవలలను ఇష్టపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. స్క్రిప్ట్ రైటర్‌గా మారిన తర్వాత కూడా నన్ను ఇదేరకంగా అభిమానిస్తారని భావిస్తున్నా. అయితే రచయితలకు అంతగా గుర్తింపు దక్కకున్నా నాకు మాత్రం అలాంటి పరిస్థితి ఎదురుకానందుకు నేను అధృష్టవంతుడిని. కేవలం నా పుస్తకాల అధారంగా సినిమాలు తెరకెక్కినందుకే కాదు బాలీవుడ్‌లో ఎందరో ప్రతిభావంతులతో పనిచేసే అవకాశం నాకు దక్కినందుకు నేను అధృష్టవంతుడిని అని చెప్పుకొచ్చారు.
'కాయ్ పో చే' చిత్రం కూడా నా నవల 'త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్' ఆధారంగా తెరకెక్కింది. దీంతో ఆ సినిమాకు స్క్రిప్ట్ రాయడం చాలా సులభమైంది. అయితే కిక్ సినిమాకు స్క్రిప్ట్ రాయడం అంత సులభం కాదు అని చెప్పారు. 'కిక్' సల్మాన్‌ఖాన్ హీరోగా సాజిద్‌నదియావాలా దర్శకత్వంలో అదే పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. హిందీ నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారు. అలాగే కిక్ తమిళ వెర్షన్ ని ఎడిటర్ మోహన్ కుమారుడు జయం రవితో నిర్మించారు. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లాప్ గా నమోదయింది. తమన్నా అందచందాలు కూడా సినిమాని నిలబెట్టలేకపోయాయి. అయితే ఈ కిక్ రీమేక్ పై సల్మాన్ ఖాన్ బాగా నమ్మకంగా ఉన్నారు. తాను చేసిన 'పోకిరి', 'రెడీ' రీమేక్స్ హిట్టవటంతో ఈ చిత్రం కూడా అదే రేంజిలో వర్కవుట్ అవుతుదని నమ్ముతున్నాడు.


Click it and Unblock the Notifications












