మీకు అక్క, చెల్లి, అమ్మ లేరా.. వ్యభిచారితో పోలుస్తూ.. ప్రముఖ సింగర్!
బాలీవుడ్ లో ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై హీరోయిన్ తనుశ్రీ దత్త చేసిన కామెంట్స్ తో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. చాలా మంది సినీతారలు, సెలెబ్రిటీలు తనుశ్రీకి మద్దత్తుగా నిలిచారు. సౌత్ లో కూడా మీటూ ఉద్యమం హాట్ టాపిక్ గా మారింది అంటే అందుకు కారణం ప్రముఖ సింగర్ చిన్మయి అని చెప్పొచ్చు. రచయిత వైరముత్తుపై చిన్మయి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కొందరు చిన్మయికి మద్దత్తుగా నిలిస్తే, కొందరు ఆమెని తప్పుబట్టారు. వైరముత్తు వివాదం తర్వాత తాను ఎంతగా బెదిరింపులు, వేధింపులు ఎదుర్కొంటున్నానో తాజాగా చిన్మయి మీడియాకు వివరించారు.

అంత సులభం కాదు
మన దేశంలో అన్యాయానికి గురైన మహిళలకు న్యాయం జరగడం అంత సులువైన విషయం కాదు అని చిన్మయి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఓ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చిన్మయి మీడియాతో మాట్లాడారు. తాను వైరముత్తు పై ఆరోపణలు చేయడం వలనే తమిళనాడు డబ్బింగ్ అసోసియేషన్ నన్ను బహిష్కరించింది. వైరముత్తు మాత్రం పెద్దమనిషిగా చలామణి అవుతూ, సన్మానాలు చేయించుకుంటున్నారని చిన్మయి తెలిపింది.

చనిపోతేనే
మన దేశంలో మహిళ అన్యాయానికి గురై మరణిస్తేనే ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటారు. అదే మహిళ తనకు వేధింపులు ఎదురవుతున్నాయని చెబితే మాత్రం అవమానిస్తారు, బెదిరిస్తారు అని చిన్మయి తెలిపింది. ప్రస్తుతం నేను అలాంటి అవమానాలే ఎదుర్కొంటున్నాను. సోషల్ మీడియాలో దారుణ పదజాలంతో నన్ను చాలా మంది దూషిస్తున్నారు అని చిన్మయి తెలిపింది.

అక్క, చెల్లి, అమ్మ లేరా
నాతో పడుకోవడానికి ఎంత తీసుకుంటావు అని మెసేజ్ లు పెడుతుంటారు. చాలా దారుణమైన కామెంట్స్ తో నన్ను ట్రోల్ చేస్తున్నవారికి ఒక్కటే చెప్పదలుచుకున్నా. మీకు అక్కా, చెల్లి, తల్లి ఎవరూ లేరా.. వాళ్ళు ఇలాంటి పనులని అంగీకరిస్తున్నారా అంటూ చిన్మయి మండిపడ్డారు. వైరముత్తుపై నేను ఆరోపణలు చేసిన తర్వాత నా వ్యక్తిత్వాన్ని కించపరిచే పనులు చేస్తున్నారు. నన్ను వ్యభిచారిగా చిత్రీకరించే ప్రయత్నం కూడా జరుగుతోంది అంటూ చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బట్టలపై కామెంట్స్
అమ్మాయిల వస్త్రధారణ సరిగా లేనందు వలనే లైంగిక వేధింపులు జరుగుతున్నాయని మాట్లాడేవారు లేకపోలేదు. అబ్బాయిలు తప్పులు చేస్తుంటే అమ్మాయిలకు నీతులు బోధిస్తారు ఎందుకో అర్థం కావడం లేదని చిన్మయి తెలిపింది. తనకు ప్రస్తుతం తమిళం నుంచి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని చిన్మయి తెలిపింది. తెలుగు కన్నడ భాషల్లో మాత్రం అవకాశాలు వస్తున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications











