యువ హీరోకు లాక్‌డౌన్ కష్టాలు.. కేంద్ర మంత్రికి షేవింగ్ చేస్తూ.. వీడియో వైరల్
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఇంట్లో ఎవరి పనులు వారే చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సూపర్‌స్టార్లంతా వంటగదిలోకి దూరి చేతివాటం ప్రదర్శిస్తూ వంటలతో కిచెన్‌ను ఘుమఘుమలాడిస్తున్నారు. అలాగే కొందరు వంట గిన్నెలు సైతం కడుగుతూ కష్టాలను సోషల్ మీడియా ద్వారా చెప్పుకొంటున్నారు. ఇలాంటి క్రమంలో రాజకీయ కుటుంబం నుంచి సినీ తెరకు పరిచయమైన ఓ హీరో తండ్రికి షేవింగ్, కటింగ్ చేస్తూ ఆకట్టుకొన్నారు. వారిద్దరు చేసిన పనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

గృహ నిర్బంధం కష్టమే కానీ
లాక్‌డౌన్ చాలా కష్టకాలంగా అనిపించినా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకొనే అవకాశం ఏర్పడింది. ఇంటి సభ్యులకు ఎలాంటి ప్రతిభ ఉందో.. ఏ విషయాల్లో నైపుణ్యం ఉందో తెలుసుకొనే అవకాశం దక్కింది. కరోనావైరస్ మాకు అందమైన అనుభూతులను పంచుతున్నది అని చిరాగ్ పాశ్వాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు

ఎలక్ట్రికల్ షేవర్‌తో తండ్రికి
స్వీయ గృహ నిర్బంధంలో తండ్రి రాంవిలాస్ పాశ్వన్‌కు చిరాగ్ పాశ్వాన్ ఎలక్ట్రికల్ షేవర్‌తో గడ్డం ట్రిమ్మింగ్ చేస్తూ కనిపించారు. ఇలాంటి సమయంలో తండ్రితో సంపూర్ణంగా గడిపే అవకాశం దక్కింది. నా తండ్రి నుంచి చాలా విషయాలు తెలుసుకొనే ఛాన్స్, అలాగే ఆయన అనుభవాలను పంచుకొనే అవకాశం కలిగింది అని చిరాగ్ పేర్కొన్నారు.
వైరల్‌గా వీడియో.. నెటిజన్ల కామెంట్లు
పాశ్వాన్ తండ్రి కొడుకుల వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అనూహ్యమైన స్పందన లభించింది. ఈ వీడియోకు దాదాపు 12 వేల వ్యూస్ లభించాయి. సీనియర్ నేత, యువనేత వీడియోను అభిమానులు చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరాగ్‌ను గ్రేట్ యూత్ ఐకాన్, తండ్రి కొడుకుల అనుబంధానికి ఇదే నిదర్శనం అంటూ ప్రశంసిస్తున్నారు.

బాలీవుడ్‌లో షాక్.. పాలిటిక్స్‌లోకి
చిరాగ్ పాశ్వాన్ బాలీవుడ్‌లోకి ప్రవేశించి తన అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నం చేశారు. ఆయన నటించిన మిలే నా మిలే హమ్ సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టడంతో రాజకీయాల్లోకి దూకారు. గత ఎన్నకిల్లో లోక్ జనశక్తి పార్టీ తరపున జముల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం రాంవిలాస్ పాశ్వాన్ కేంద్ర ఆహారశాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











