పవన్ పార్టీపై చిరంజీవి స్పందన
హైదరాబాద్ : పవన్‌కల్యాణ్ పార్టీ ఏర్పాటు చేయడంపై చిరంజీవి స్పందించారు. ''ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే హక్కు, అధికారం, అవకాశం అందరికీ ఉంది. వ్యక్తిగతంగా పార్టీ పెట్టడం అనేది పవన్ ఇష్టం'' అన్నారు చిరంజీవి. మరో ప్రక్క తన తమ్ముడు పవన్ పార్టీ పెట్టినా అన్నయ్య చిరంజీవితోనే ఉంటామని నాగబాబు ప్రకటించారు. ఈ మేరకు మీడియాకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
నాగబాబు మాట్లాడుతూ... చిరంజీవి తమ అందరికీ గొప్ప రాజమార్గం తయారు చేశారన్నారాయన. ఈ రాజమార్గం కోసం ఆయన ఎన్నో వ్యయప్రయాసలకీ, కష్టనష్టాలకీ ఓర్చారని నాగబాబు తెలిపారు. తమ్ముళ్లకే కాకుండా అభిమానులకీ ఎంతో గుర్తింపు తెచ్చారన్నారాయన. అన్నయ్య వేసిన రాజమార్గంలో వెళ్లే తాను, పవన్, చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఎవరి స్థాయికి తగ్గ విధంగా గుర్తింపునీ, పేరుప్రఖ్యాతుల్నీ సంపాదించుకున్నామన్నారు. తాను, మెగా అభిమానులు చిరంజీవితోనే ఉంటామని నాగబాబు వెల్లడించారు.

మరి కొద్ది గంటలలో పార్టీ స్థాపన గురించి అధికారికంగా పవన్ ప్రకటించనున్న తరుణంలో చిరంజీవి రాష్ట్ర వ్యాప్తంగా గల తమ అభిమాన సంఘాల నాయకులతో ఢిల్లీనుంచి టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్టు తెలుస్తున్నది. రేపటి సమావేశాలకు వెళ్లరాదన్న ఆదేశాలను కొంతమంది చిరు అభిమానులు ధిక్కరిస్తూ మాట్లాడినట్టు తెలుస్తున్నది. చిరును నమ్ముకుని ప్రజారాజ్యం వెంట నడిస్తే చివరికి చిరు కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు కొంతమంది ముక్కు సూటిగా వెళ్లే పవర్ స్టార్ వెంట నడిస్తేనే మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. వారు ఈమాటే చిరుకు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.
పవన్ కల్యాణ్ సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తున్న విషయం మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో చిచ్చు పెట్టింది. చిరంజీవి కుమారుడు రాం చరణ్ తేజ్ మొన్న, చిరంజీవి సోదరుడు నాగబాబు నేడు తామంతా చిరంజీవి వెంటే ఉంటామని స్పష్టం చేయడంతో పవన్ ఒంటరి అయిపోయారు. ఎవరు ఏమి మాట్లాడినా పేర్టీ పేరు ప్రకటించేవరకూ మారు మాట్లాడకూడదని పవన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











