కోడి రామకృష్ణ కూతురి నిశ్చితార్థం.. హాజరైన చిరు, బాలయ్య, వెంకీ
టాలీవుడ్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి.. అద్భుతమైన విజయాలు అందుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ. దాదాపు నాటి హీరోలందరికీ బ్లాక్ బస్టర్ హిట్‌లను ఇచ్చాడు. లేడీ ఓరియెంటెడ్, భక్తి రస చిత్రాల్లో అప్పట్లోనే గ్రాఫిక్స్‌ను అత్యద్భుతంగా వాడి టెక్నాలజీని పరిచయం చేశాడు.

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో మొదలు..
చిరంజీవి డిఫరెంట్ పాత్రలో చూపిస్తూ.. కొంచెం నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి దర్శకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టాడు. చిరు కెరీర్‌లో ఆలయ శిఖరం, గూఢచారి నెం.1లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌లను అందించాడు.

బాలయ్యకు మరుపురాని హిట్స్..
నందమూరి బాలకృష్ణ, కోడిరామకృష్ణలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణుడు, మువ్వ గోపాలుడు, భారతంలో బాలచంద్రుడు, ముద్దుల మావయ్యలాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌కు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.

వెంకటేష్, రాజశేఖర్ ఇమేజ్ మార్చిన దర్శకుడు...
వెంకటేష్‌కు శ్రీనివాస కళ్యాణం, శత్రువు లాంటి సినిమాలు ఇవ్వగా.. రాజశేఖర్‌కు యాంగ్రీ యంగ్‌మెన్ ట్యాగ్‌ను ఇచ్చాడు. అంకుశం లాంటి సినిమాలో రాజశేఖర్ ఇమేజ్‌ను అమాంతం పెంచేశారు. ఇలా ప్రతీ ఒక్క హీరోకు వారి కెరీర్‌లో నిలిచిపోయే సినిమాలను తెరకెక్కించాడు.

గ్రాఫిక్స్ సినిమాలతో మాయాజాలం..
తెలుగులో మొట్టమొదటి సారిగా గ్రాఫిక్స్‌ను ఓ రేంజ్‌లో వాడింది కోడి రామకృష్ణే. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన అమ్మోరు చిత్రం తెలుగులో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ టాలీవుడ్‌లో అతిపెద్ద సక్సెస్‌ను రుచిచూసింది. ఇక గ్రాఫిక్స్ నేపథ్యంలోనే దేవీ, దేవీ పుత్రుడు, అంజి, అరుంధతి లాంటి సినిమాలు వచ్చాయి.

నటుడిగానూ తనదైన ముద్ర...
దొంగాట, ఆస్తి మూరెడు ఆశ బారెడు లాంటి చిత్రాల్లో మంచి పాత్రలను పోషించి.. నటుడిగానూ నిరూపించుకున్నారు. కేవలం తెలుగు చిత్ర సీమలోనే కాకుండా దక్షిణాది భాషల్లో ఎన్నో విజయాలు చూసిన ఈయన.. ఫిబ్రవరి 22న కన్నుమూశారు. చివరగా కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించారు.

కోడిరామకృష్ణ కూతురి నిశ్చితార్థానికి కదిలివచ్చిన సినీలోకం..
ప్రముఖ దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కుమార్తె కోడి ప్రవల్లిక నిశ్చితార్థం సిహెచ్ మహేష్‌తో జరిగింది. పార్క్ హయత్‌లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ , రెబల్ స్టార్ కృష్ణంరాజు, మురళీ మోహన్, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, గంటా శ్రీనివాస్, ఎంఎస్ రాజు, దిల్ రాజు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











