చిరు ‘మాజీ మెగాస్టార్’!?
మెగాస్టార్ చిరంజీవి అప్పుడే మాజీ అయ్యిపోయారా..అనే సందేహం కలిగిస్తూ గత రెండు రోజులుగా చర్చలు, పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. దానికి కారణం ఆయన మగధీర ఆడియో పంక్షన్ స్టేజీపై చేసిన వ్యాఖ్యలు. ప్రజలు పిలిస్తేనే రాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన బలవంతంగానే రాజకీయాల్లోకి వచ్చారా? ఆయన రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నాయి. దాంతో ఓ ప్రక్క చిరు మళ్ళీ నటుడుగా కొనసాగుతాడా అనే చర్చ ప్రజల్లోనూ,రాజకీయరంగంలోనూ జరుగుతోంది.
'మనిషి అక్కడున్నా, మనసంతా ఇక్కడే ఉంది. రాజకీయాల్లో ఎత్తుగడలు వేస్తారు. ఇక్కడ ఎత్తడమే కానీ ఎత్తుగడలుండవు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేను. విధి ఎలా నడిపిస్తే అలా అంటూ ఆయన మగధీర పంక్షన్ లో చెప్పారు. అలా అంటూనే ఆయన ఇప్పటికయితే నటించే అవకాశం లేదని స్పంష్టం చేసారు. అయితే అందులోనే మళ్లీ ఆయన మళ్లీ నటిస్తారన్న సంకేతాలు కనపడుతున్నాయంటున్నారు అందరూ. ఇక ఇప్పటివరకూ 148 సినిమాల్లోనటించిన చిరు మగధీరలో 30 సెకన్ల పాటు కనిపించి మురిపించనున్నారు. బంగారుకోడిపెట్ట అంటూ కొడుకుతో నర్తించనున్నారు. మరో ప్రక్క పరుచూరి బ్రదర్స్ తమ వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ చిరంజీవి కోసం సిద్ధంగా ఉందని ఊరిస్తున్నారు.
చిరు మాట్లాడకు ముందు చిరు సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ తో పాటు ఫ్యాన్స్ కూడా చిరంజీవి సినిమాల్లో నటించాలని డిమాండ్ చేయటం చూస్తే..ఆయన తన సినిమా రంగ పునః ప్రవేశానికి అన్నీ రంగం సిద్ధంచేసుకునే ఈ విధం గా వారితో అనిపించారన్న అనుమానాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సినీరంగంలో మాదిరి గానే రాజకీయాల్లో తనకు నీరాజనాలు పడతారని భావించి, భంగపడినందునే మళ్లీ ఆయనకు సినిమాలపై మనసు మళ్లిందన్న వ్యంగ్యోక్తులు కూడా విసురుతున్నారు. అలాగే, చిరంజీవి సినిమా రంగ పునఃప్రవేశం ఫలిస్తుందా అన్నచర్చకు తెర తీస్తున్నారు. సినిమాల్లో ఉన్నప్పుడు అందరివాడుగా ఉన్న ఆయన రాజకీయాల్లోకి వచ్చి కొందరివా డవడంతో ఆయన సినిమాలకు మునుపటిలా అంత ఆదరణ ఉండే అవకాశం లేదని అన్యాపదేశంగా చెప్తున్నారు. దానికితోడు ఎన్నికల ప్రచారం, రాజకీయాల్లో ఒత్తిళ్లతో చిరంజీవిలో మునుపటి గ్లామర్ చాలావరకూ తగ్గినందున సహజంగానే మునుపటి గ్లామర్ ఉండదని డైరక్టుగా చెప్తున్నారు.
అంతేగాక ఇలా గ్లామర్ తగ్గటాన్ని ప్రస్తుతం మిగిలి ఉన్న ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోకపోవచ్చని చెబుతున్నారు. చిరంజీవి వేషాలు వేస్తే మహా అయితే అన్న, తండ్రి పాత్రలకు సరిపోతారు తప్ప, మునుపటిలా హీరో పాత్రలకు ఇప్పటి ఆయన శరీరం కూడా సహకరించపోవచ్చు అంటూ ఆక్షేపిస్తున్నారు. అయితే చిరు తిరిగి అభిమానులను ఆకట్టుకునేందుకే చిరంజీవి సినిమా రంగప్రవేశంపై వ్యాఖ్యలు చేసి ఉంటారని వారు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా చిరు మాత్రం ఇప్పటికీ మెగాస్టార్ అన్నది మాత్రం నిజం. మరో మెగాస్టార్ వచ్చిన తర్వాత మాజీ అనే పదం గురించి ఆలోచించటం మేలు.


Click it and Unblock the Notifications











