చిన్నారిని కాపాడిన ఫైర్‌మెన్: రూ. లక్ష బహుమతి అందించిన మెగాస్టార్ చిరంజీవి!
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ ఫైర్‌మెన్‌ను ప్రోత్సహిస్తూ రూ. 1 లక్ష బహుమతి అందించారు. నాలాలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారిని కాపాడినందుకుగాను ప్రోత్సాహకంగా దీన్ని అందజేశారు.
భారీ వర్షాలు కారణంగా ఆదివారం హైదరాబాద్ గౌలీగూడలోని నాలాలో ప్రమాదవశాత్తు దివ్య(4) అనే చిన్నారి పడిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఆమెను కాపాడారని పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గౌలీగూడ ఫైర్‌మెన్ క్రాంతి కుమార్ అభినందించారు.

ఈ సందర్భంగా ఫైర్‌మెన్ క్రాంతి కుమార్‌కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు ప్రోత్సాహక బహుమతి అందించారు. ఈ మేరకు ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ అల్లు అరవింద్ స్వయంగా చెక్ అందజేశారు. క్రాంతి కుమార్‌కు సహకరించిన ఫైర్ సిబ్బంది, గౌలిగూడ స్టేషన్ ఎఫ్ఎస్ఓ శ్రీ జయరాజ్ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందించారు.

చిరంజీవి సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా నరసింహారెడ్డి' చిత్రం చేస్తున్నారు. రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే దసరా సీజన్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











