ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ముఖ్యమంత్రి కాబోతున్నారని రెబెల్ స్టార్, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు జోస్యం చెప్పారు. హంగ్ అసెంబ్లీ వచ్చినా చిరంజీవే ముఖ్యమంత్రి అని, ఈ విషయాన్ని తాను గతంలో కూడా చెప్పానని ఆయన అన్నారు. రాజమండ్రి లోక్ సభ స్ధానం నుంచి పీఆర్పీ టికెట్ పై పోటీ చేసిన ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో టిడీపి తరఫున మురళీమోహన్, కాంగ్రెస్ తరఫున ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీ చేశారు. మార్పు కోరుకుంటున్న యువత, మహిళలు ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు వేశారని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీకి 9 నుంచి 12 లోక్ సభ స్ధానాలు వస్తాయని కృష్ణంరాజు అంచనా వేశారు.