ఒక్కరొక్కరే దూరమవుతున్నారు: చిరంజీవి ఆవేదన
హైదరాబాద్: సినీ పరిశ్రమకు చెందిన కళాకారుల మరణాల పట్ల కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైరాగ్యంతో కూడిన ఆవేదన ఆయన మాటల్లో వ్యక్తమైంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఒక్కొక్కరుగా మృతి చెందడంపై ఆయన ఆవేదనతో స్పందించారు. కొత్త సంవత్సరం ఆరంభంలోనే నటుడు ఆహుతి ప్రసాద్ మృతి చెందగా, సోమవారం సంభాషణల రచయిత గణేష్ పాత్రో కన్నుమూసిన విషయం తెల్సిందే.
ఆదివారం ఉదయం కేన్సర్ వ్యాధితో కన్నుమూసిన ఆహుతి ప్రసాద్ భౌతికకాయానికి ఆయన సోమవారం ఉదయం నివాళులు అర్పించారు. "ఏమిటో... సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు ఒక్కొక్కరు దూరమవుతున్నారు. చాలా దురదృష్టకరం. ఎంతో బాధగా ఉంది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ మాటల రచయిత గణేష్ పాత్రో మరణించడం కూడా కలచివేస్తోందన్నారు.

తెలుగు సినీ పరిశ్రమకు ఆహుతి ప్రసాద్, గణేష్ పాత్రోలు ఎంతో సేవ చేశారని కొనియాడారు. అకాల మరణం పొందిన వీరిద్దరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ అంతిమ యాత్ర సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎర్రగడ్డ స్మశాన వాటికలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఆహుతి ప్రసాద్ అంతిమ యాత్రలో తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు పాల్గొన్నారు. నటుడిగానే కాక, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించిన ఆయన భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
ప్రముఖ సినీ మాటల రచయిత గణేశ్ పాత్రో మృతికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు సంతాపం ప్రకటించారు. ఇంకా ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపం ప్రకటించారు. సంతాపం ప్రకటించిన వారిలో నటుడు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, ప్రముఖ దర్శకులు కేంద్రమాజీమంత్రి దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, పరుచూరి బ్రదర్ప్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులున్నారు.


Click it and Unblock the Notifications











