చిరు వర్కౌట్లు .. మెగాస్టార్ అని ఊరికే అన్నారా?.. ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్
సినీ ఇండస్ట్రీలో ఊరికే స్టార్లు కాలేరు.. దానికి కోసం ఏళ్ల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ ఉండాలి.. అప్పటి వరకు గమనాన్ని, దిశను మార్చేసి కొత్త ఒరవడిని సృష్టించాలి. అలా కొన్ని దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుస్తున్నాడు మెగాస్టార్. దాని వెనుక దాదాపు నాలుగు దశాబ్దాల కఠోర శ్రమ దాగి ఉంది. మెగాస్టార్‌గా అభిమానులు పిలుచుకుంటూ ఉంటే.. ఎప్పటికప్పుడు వారిని ఉర్రూతలూగించేందుకు సిద్దంగానే ఉంటాడు. తాజాగా సైరా సినిమాతో తెలుగు ప్రేక్షకులందర్నీ తలెత్తుకునేలా చేశాడు.

రీఎంట్రీతో రికార్డులు బద్దలు..
రాజకీయాల్లో ప్రవేశించాక దాదాపు దశాబ్దం పాటు చిత్ర సీమకు దూరంగా ఉండిపోయాడు. అయితే మళ్లీ సినిమాల్లోకి రావాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాడో అప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాడు. రాజకీయాల్లో ఉండటంతో ఫిట్ నెస్‌పై అంతగా శ్రద్దగా చూపకపోయినా... గ్లామర్ ఫీల్డ్‌లోకి వచ్చే ఆలోచనలు రాగానే వయసుకు మించి వ్యాయామం చేశాడు. మళ్లీ మునుపటి చిరంజీవిలా మారి ఫ్యాన్స్‌కు కనువిందు చేశాడు.

భుజానికి గాయాలు..
ఖైదీ నెంబర్ 150 సినిమాకు రెడీ అవుతున్న సమయంలో రోజూ వ్యాయామం చేసేవాడు. అభిమానులు ఇరవై యేళ్ల క్రితం చూసిన చిరును మళ్లీ తెరపై చూపించేందుకు ఆయన కఠోరంగా శ్రమించాడు. ఈ క్రమంలో ఆయన భుజానికి అప్పట్లో గాయం కూడా అయింది. దీంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఇలా ఆరు పదులు దాటిన వయసులో కూడా అభిమానులను అలరించాలనే ఆలోచనలు ఉండి.. కష్టపడే తత్వం ఉన్నవారే స్టార్లుగా రాణిస్తారు.

సైరా కోసం కఠోర శ్రమ..
చారిత్రాత్మక చిత్రమైన సైరా కోసం చిరంజీవి మరింత శ్రమించాడు. గుర్రపు స్వారీలు, కత్తి యుద్దాలు చేశాడు. ఈ వయసులోనూ అబ్బురపరిచే విన్యాసాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. యంగ్ యాక్టర్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశారు. సైరా చిత్రం కోసం చిరు చేసిన పోరాట సన్నివేశాలు.. హైలెట్‌గా నిలిచాయి.

తాజాగా కొరటాల మూవీ కోసం..
కొరటాల శివతో చేయబోయే చిత్రంలో చిరంజీవి డబుల్ యాక్షన్ చేయబోతోన్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరు యంగ్ లుక్‌లో కూడా కనపడబోతోన్నట్లు టాక్. అందుకోసం చిరు మరింత కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఈ వయసులోనూ చిరు ఉత్సాహంగా వర్కౌట్లు చేయడమే.. ఆయన అంకితభావానికి నిదర్శనమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చిరు వర్కౌట్లు చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











