రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
యువ నటుడు శర్వానంద్ నటించిన శ్రీకారం మార్చి 11వ తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా రిలీజ్ కాబొతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ...

రైతు, వ్యవసాయ కథా నేపథ్యంగా
శ్రీకారం మూవీ రైతు కథా నేపథ్యంగా రూపొందింది. ఈ సినిమాకు సంబంధించిన 9 నిమిషాల వీడియోను చూశాను. అప్పుడు ఇలాంటి స్పూర్తిదాయకమైన కథలు, కథనాలు మీడియాలో చూస్తున్నాను. వరంగల్, కరీంనగర్, కర్నూలు లాంటి పట్టణాల్లో కొందరు యువకులు లక్షలాది జీతాలు వచ్చే ఉద్యోగాలు వదిలి సొంత గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు. పట్టణాలతో తృప్తి దొరకక, వారంతా నేలతల్లిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారు అంటూ చిరంజీవి అన్నారు.

రైతు బిడ్డు రైతు కావాలనే రోజు రావాలి
మన సమాజంలో యాక్టర్ కొడుకు యాక్టర్ కావాలనుకొంటాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనుకొంటాడు. పొలిటిషియన్ కొడుకులు రాజకీయ నేత కావాలనుకొంటాడు. కానీ రైతు కొడుకు రైతు కావాలని కోరుకోవడం లేదు. రైతు కొడుకు రైతు కావాలనుకొనే రోజు రావాలి. ఆ రోజు వస్తుందనే ఆశాభావం ఉంది అంటూ చిరంజీవి ఆవేశంగా ప్రసంగించారు.

రైతే దేశానికి రాజు..
నేటి యువత సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభాసాటి వ్యాపారంగా మార్చాలి. ఆధునిక పద్దతులతో వ్యవసాయాన్ని కొనసాగిస్తే.. రైతే రాజు అనేది అక్షరాల రుజువు అవుతుంది. మన దేశానికి రైతు వెన్నుముక. మన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి ఉంది. అలాంటిది ప్రస్తుతం వ్యవసాయానికి దూరం అవుతున్నారు. వ్యవసాయం చేయడంలో జీవితం తృప్తి లభిస్తుంది. వ్యవసాయం ఎందుకు చేయాలనే ప్రశ్నకు సమాధానం శ్రీకారం సినిమాలో లభిస్తుంది అని చిరంజీవి అన్నారు.

శ్రీకారం మూవీలో వ్యవసాయం గురించి
వ్యవసాయానికి సాంకేతికత జోడిస్తే విప్లవాత్మకమైన పురోగతి లభిస్తుంది. అదే శ్రీకారం సినిమాలో మంచి కథతో, కథనాలతో స్పూర్తిదాయకంగా చూపించబోతున్నారు. నా బిడ్డ శర్వానంద్ మంచిగా నటించాడు. ఈ సినిమా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కాదు. అన్ని కమర్షియల్ విలువలు ఉన్నాయి అంటూ చిరంజీవి తన ప్రసంగాన్ని ముగించారు.


Click it and Unblock the Notifications











