చిరంజీవికి తప్పిన పెను ప్రమాదం.. ఏం జరిగిందంటే..
మెగాస్టార్ చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దాంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని అత్యవసరంగా వెనుకకు మళ్లించడంతో ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. చిరంజీవితోపాటు విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం ప్రయాణికులు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు..

చిరంజీవి ముంబై నుంచి వస్తుండగా
వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముంబై వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం సాయంత్రం విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఈ ఫ్లయిట్ టేకాఫ్ అయిన అరగంటకే సాంకేతిక సమస్యలు గుర్తించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే వెనుకు మళ్లించి ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

విమానంలో సాంకేతిక లోపం
చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో దాదాపు 120 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. విమానాన్ని వెనుకకు మళ్లిస్తున్నట్టు తెలియగానే ప్రయాణికులు ఆందోళనకు లోనైనట్టు తెలిసింది. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అర్ధగంట సేపు భయాందోళనలకు లోనైనట్టు సమాచారం. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో ఆందోళన నుంచి బయటపడినట్టు సమాచారం.

ప్రయాణికుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో
ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పుకొన్న ప్రయాణికులకు మరో అసౌకర్యం కలిగినట్టు తెలిసింది. విమానం నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులు మరో విమానం కోసం గంటలపాటు పడిగాపులు పడ్డట్టు సమాచారం. అనంతరం మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను హైదరాబాద్‌కు పంపించినట్టు తెలిసింది. ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ప్రమాద ఘటన బయటకు వచ్చింది.

సైరాతో చిరు సిద్దం
ఇక చిరంజీవి కెరీర్ విషయానికి వస్తే, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సైరా చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదిన రిలీజ్ కానున్నది. జాతీయస్థాయి సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, సుదీప్ కిచ్చ, జగపతిబాబు, నయనతార, నిహారిక తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











