Chandrayaan 3 చంద్రయాన్ 3 సక్సెస్.. చంద్రుడిపై విహార యాత్ర అంటూ చిరంజీవి, ఎన్టీఆర్, సినీతారలు ఏమన్నారంటే?
అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ మరోసారి తన సత్తాను చాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ గర్వించ దగిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రమండలంపై ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్ బుధవారం సాయంత్రం 6.04 గంటల ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
దాంతో ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, భారతీయులందరూ కరతాళ ధ్వనులతో విజయ గర్వాన్ని చాటారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ, సినీ తారలందరూ చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంపై ప్రశంసలు గుప్పించారు. సినీ ప్రముఖులు ఎవరెవరూ ఏమన్నారంటే?

చంద్రుడిపైకి వెళ్లే సమయం దగ్గర్లోనే: చంద్రయాన్ 3 ప్రయోగం భారత్‌కు అద్బుతమైన విజయం. చంద్రయాన్ 3 ప్రయోగం తిరుగులేని, అరుదైన విజయంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ రోజు భారత్ మరో చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది భారతీయులతో కలిసి ఈ విజయాన్ని ఆస్వాదించడమే కాకుండా భారతీయ శాస్త్రవేత్తలను కంగ్రాట్స్ చెబుతున్నాను.
ఈ ప్రయోగం చంద్రుడిపై మరిన్ని నూతన ఆవిష్కరణలకు మార్గం వేస్తుందని ప్రగాఢ నమ్మకంతో ఉన్నాను. ఇంకా చంద్రుడిపైకి మరిన్ని ప్రయోగాలకు బాట వేస్తుంది. ఒక రోజు చంద్రుడిపై విహార యాత్రకు వెళ్లే సమయం ఎంతో దూరం లేదు అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ ట్వీట్ చేసి: చంద్రుడిపై అడుగుపెట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్‌ఫుల్ చేసినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు కంగ్రాట్స్. భారతదేశానికి ఈ విజయం గర్వకారణంగా నిలిచిపోతుంది అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
నా హృదయం ఉప్పొందుతున్నది: చంద్రుడిపై చంద్రయాన్ 3 సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో దర్శక ధీరుడు రాజమౌళి ఎమోషనల్ అయ్యారు. ఎస్.. ఎస్.. ఎస్‌స్స్‌స్స్‌స్. ఎట్టకేలకు చంద్రుడిపై భారత్ కాలుపెట్టింది. ఈ అరుదైన విజయాన్ని చేజిక్కించుకొన్న ఇస్రోకు నా దండాలు. గర్వంతో నా హృదయం ఉప్పొగింది. నా చెంపల వెంట ఆనందభాష్పాలు జలజలా రాలాయి. అద్బుతమైన విజయాన్ని అందుకొన్న ఇస్రోకు నా ప్రణామాలు. జై హింద్ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
మంచు విష్ణు ట్వీట్: చంద్రుడిపై భారత్ అడుగుపెట్టి అరుదైన చరిత్ర సృష్టించింది. అద్బుతమైన విజయాన్ని సాకారం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు. ఇస్రో శాస్త్రవేత్తల అంకిత భావం, గొప్పతనం మనకు స్పూర్తిగా నిలుస్తుంది. అంతరిక్ష పరిశోధనలో భారత్ అరుదైన చరిత్రను తిరగరాసింది. భారత్ మాతా కీ జై అని విష్ణు మంచు ట్వీట్ చేశారు.
మోహన్ బాబు ఏమన్నారంటే?: చంద్రుడిపై చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంపై మోహన్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రుడిపై సురక్షితంగా చంద్రయాన్ 3 ల్యాండ్ కావడం గర్వకారణంగా ఉంది. ఇస్రో శాస్త్రవేత్తల అంకిత భావం, పట్టుదల స్పూర్తిదాయకం. భారతీయ అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడం చాలా ఉత్తేజంగా నిలిచింది. చంద్రుడిపై సురక్షితంగా చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది. భారత్‌కు గర్వకారణంగా నిలిచింది. చంద్రుడిపై ఈ అరుదైన ప్రయోగంపై ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది అని కాజల్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
ఎట్టకేలకు దక్షిణ ధ్రువంపై మానవ ప్రయత్నం సక్సెస్ అయింది. చంద్రయాన్ ప్రయోగాన్ని సక్సెస్ చేసిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇస్రో సిబ్బందికి నా కంగ్రాట్స్. చంద్రుడిపై చంద్రయాన్ 3 సురక్షితంగా ల్యాండ్ అయినందుకు ఆనందంగా ఉంది. శాస్త్రవేత్తల అంకితభావం, పట్టుదల దేశానికి గర్వకారణంగా నిలిచింది అని మోహన్ లాల్ అన్నారు.
భారతీయ అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్రను లిఖించిన ఇస్రో శాస్త్రవేత్తలకు కంగ్రాట్యులేషన్. చంద్రయాన్3 ప్రయోగాన్ని సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవదాలు. శాస్త్రవేత్తల అలుపెరుగని ప్రయత్నం, అంకితభావం దేశానికి గర్వకారణమైంది అని మాస్ మహారాజా రవితేజ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











