న్యూ ఇయర్ లో వినాయక్ తో చిరు 149వ చిత్రం
శంకర్ దాదా జిందాబాద్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం, ఆ తరువాత కుమారుడి చిరుత విడుదల కావడం జరిగింది. చిరుత సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేయకముందే చిన్నకూతురు శ్రీజ రహస్య ప్రేమ వివాహం చేసుకోవడంతో చిరంజీవి కుటుంబం ఇబ్బందుల్లో పడింది. శంకర్ దాదా జిందాబాద్ సినిమా ఫ్లాప్ కావడంతో తదుపరి చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని దర్శకుల వేటలో ఉండగానే కూతురు ఉదంతం జరిగింది. తదుపరి చిత్రం 149వ చిత్రం కావడం, 150వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించుకోవాలని చిరంజీవి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు.
150వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఎపుడో ఖరారు చేసుకున్నాడు చిరంజీవి. ఆ సినిమా విడుదలతోనే సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో అడుగుపెడదామనుకున్న చిరంజీవికి ప్రస్తుత పరిణామాలు తీవ్ర ఇబ్బందులు సృష్టించాయి.ఇపుడిపుడే ఆ సమస్యలనుంచి బయటపడుతున్న చిరంజీవి లండన్ మీదుగా ఈ నెల 10న అమెరికాకు వెళుతున్నట్టు సమాచారం. అక్కడే తన 149వ చిత్రాన్ని ఫైనల్ చేసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివివినాయక్ తయారుచేసిన సోషియో పొలిటికల్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ భొగట్టా.
వివివినాయక్ ఈ మాసాంతంలో చిరంజీని కలుసుకోవడానికి అమెరికా వెళుతున్నట్టు తెలుస్తోంది. రవితేజ హీరోగా రూపొందుతున్న బెజవాడ బుజ్జి సినిమా పూర్తి అయి విడుదల అయిన తరువాత చిరంజీవి సినిమాకు వినాయక్ పనిచేయనున్నట్టు తెలుస్తోంది. అంటే సంక్రాంతికి చిరంజీవి 149వ చిత్రం ప్రారంభం కావచ్చు. అంతదాకా చిరంజీవి అమెరికాలోనే విశ్రాంతి తీసుకోనున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











