జై చిరంజీవ రిపీట్ కాదు: చిరు
క్షణమాత్రం దర్శనం చేసుకోడానికి వేలాదిగా విశాఖ తీరానికి చేరుకున్న అభిమాన జనసందోహాన్ని మెగాస్టార్ చిరంజీవి నవ్వుతూ పలకరించారు. వర్షంలో తడుస్తూ సైతం విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. నటుడే కాకుండా వైద్యుడు కూడా అయిన అల్లు రామలింగయ్య స్వాతంత్య్ర సమరంలో సైతం పాల్గొన్నారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ప్రదానం చేయడంతో పాటు గతంలో వైజాగ్ సమీపంలోని కాపులుప్పాడు వద్ద రామలింగయ్యకు స్థలం కూడా కేటాయించింది.
తొలుత విమానంలో హైదరాబాద్ నుంచి వైజాగ్ బయల్దేరిన చిరంజీవి, వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం వెనక్కి మళ్లింది. తర్వాత తిరిగి వైజాగ్ చేరుకోగా మెగాస్టార్ విమానాశ్రయం నుంచి నేరుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. వర్షంలో సైతం వేలాదిగా అక్కడికి చేరుకున్న అభిమాన జన సందోహం మధ్య చిరంజీవి అతికష్టం మీద వేదికపైకి చేరుకుని తమ మామగారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన అభిమానులతో మాట్లాడుతూ స్టాలిన్ పాటలు మిమ్మల్ని ఇప్పటికే అలరిస్తున్నాయి కదూ.. అంటూ ప్రశ్నించడంతో జనం అవునంటూ హర్షామోదాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. జై చిరంజీవ చిత్రం పట్టు తప్పిన మాట వాస్తవం.. కానీ ఈసారి అలా జరగదు.. స్టాలిన్ ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది.. అని చెప్పారు. విశాఖ తీరంగా హాస్యనట చక్రవర్తి అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషించదగ్గదని చెబుతూ.. ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ చిరంజీవి అభినందనలు తెలిపారు.


Click it and Unblock the Notifications