జనవరిలో చిరు పార్టీ విడుదల
చిరంజీవి పార్టీ పెట్టడం ఖరారైపోయింది. ఇక మంచి రోజు చూసుకుని ప్రకటించడమే తరువాయి. సోమవారంనాడు నగరంలో ఎంపికచేసిన కొంతమంది జర్నలిస్టులతో సమావేశమవడమే దీనిని స్పష్టంచేస్తోంది. జనవరి మొదటి వారంలో లేకుంటే సంక్రాంతికి తన పార్టీని చిరంజీవి ప్రకటించే అవకాశం ఉంది. చిరంజీవి పార్టీ పెడితే మొట్టమొదట ఎదురయ్యే ఇబ్బంది ప్రత్యేక తెలంగాణా. ఈ విషయంలోనూ చిరంజీవి స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకొన్న తరువాతే తన మనుషులతో మీడియా వ్యక్తులను కలిసినట్టు తెలుస్తోంది. ప్రజలు బలంగా తెలంగాణా కోరుకుంటున్న నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రాన్ని ఎందుకు వ్యతిరేకిస్తామని చిరంజీవి సంబంధీకులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణా విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్న చిరంజీవి ఇతర పార్టీలతో కలిసి థర్డ్ ఫ్రంట్ కు సిద్ధమవుతారా..లేక ఎవరి మద్ధతు లేకుండా రాజకీయ రంగంలోకి దూకుతారా అన్నది ఇపుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించినపుడు ప్రజల మద్ధతుతోపాటు కాంగ్రెస్ ను ఎదుర్కోలేక పోయిన పార్టీలన్నీ మద్ధతు పలికాయి. చిరంజీవి తెలంగాణాను ప్రకటించే నేపథ్యంలో ఎవరి సహకారం లేకుండానే రంగంలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బిఎస్పీలో చేరతారా లేక తనే సొంతంగా పార్టీ పెట్టి ఆ పార్టీతో కలిసి ఎన్నికల గోదాలోకి దూకుతారా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ఇప్పటికిప్పుడు బీఎస్పీకి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ బలం లేదు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ సమస్యల్లా బిఎస్పీ నాయకురాలు రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఔత్సాహిక రాజకీయనాయకులు ఎటువెళ్లాలనే మీమాంసలో ఉంటారు. దీనిని కూడా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం చిరంజీవికి ఉంది.


Click it and Unblock the Notifications











