‘జంజీర్’ టీంను ఆశ్చర్య పరిచిన మెగాస్టార్
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రం షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి సమాచారం లేకుండా ఈ షూటింగ్ సెట్లోకి సడెన్‌గా ఎంటరయి అందరినీ ఆశ్చర్య పరిచారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి వస్తున్నారన్న విషయం ఆయన తనయుడు రామ్ చరణ్ కు కూడా తెలియదట.
చిరంజీవి ఆకస్మికంగా వచ్చి సర్ ప్రైజ్ ఇవ్వడంతో.... దర్శకుడు అపూర్వ లఖియాతో పాటు, హీరో రామ్ చరణ్, హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆయనకు సాదర స్వాగతం పలికారు. అక్కడ కొంత సేపు గడిపిన చిరంజీవి షూటింగ్ విశేషాలను దర్శకుడిని అడిగి తెలుసుకున్నారు.
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి కూడా ముఖ్య పాత్రలు పోస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన 'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చెర్రీకి కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు. రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో, వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











