చిరంజీవి వల్ల అవుతుందా?
చిరంజీవి రాజకీయాలలోకి వస్తారో రారో కానీ ఆయన మీద చర్చలు మాత్రం రోజూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చిరంజీవి రాజకియాల గురించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సిసి రెడ్డి తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆయన మాటల్లోనే...చిరంజీవి అంటే నాకెంతో అభిమానం. సచ్చీలుడు, నిజాయితీ పరుడు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గదే..బడుగుల తరపున ఆయన నిలబడతారని చెబుతున్నారు...అలా జరిగితే మంచిదే...ఇవాళ రాజకీయరంగం కలుషితమై ఉంది...దీని ప్రక్షాళన అంత సులువు కాదు...అది చిరంజీవి వల్ల అవుతుందా అన్నదే సందేహం...అన్నారు.
సోమవారం ఆయన ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా తెరపై అనేక అద్భతమైన చిత్రాల్లో నటించడం ద్వారా అశేషమైన అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి రాజకీయాలలోనూ అలాగే అభిమానులను సంపాదించుకోగలరా అని అన్నారు. ఎందుకంటే సినిమాలో ఫైటింగులు చేయాలంటే డూపులుంటారు. కానీ రాజకీయాల్లో డూపులుండరు. చుట్టూ శతృవులు, ప్రతికూల, అనుకూల వర్గీయులు, అవినీతి పరులు ఉంటారు. వీరినందరిని చిరంజీవి నియంత్రించగలరా అని ఆయన అన్నారు. తనకు చిరంజీవి మరీ అంత సన్నిహితం కాకపోయినా ఆయన గురించి బాగా తెలుసు అని సీసీ రెడ్డి అన్నారు. శాంత స్వభావి, నిగర్వి అంటూ చిరంజీవి గురించి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాంటి స్వభావం కల్గిన చిరంజీవి రాజకీయాల్లో రాణించగలరా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరోగా ఆయన నటనను మెచ్చిన వారంతా అభిమానులుగా ఆయన్ని భుజాన ఎక్కించుకుంటారు.కానీ రాజకీయాల్లో అలా కాదు. మంత్రి పదవి దక్కనివారు, ఇతరత్రా గౌరవాలు లభించనివారు ఆయన పంచన చేరుతారు. అలాంటి వారికి ఆయన దగ్గరా అవకాశం లభించకపోతే ఆయన్ని భుజాన మోస్తారా అని అన్నారు. చిరంజీవికి తాను సలహా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇలా మాట్లాడడం లేదని కేవలం ఇది తన అభిప్రాయం మాత్రమేనని ఆయన అన్నారు. చిరంజీవికి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. వాటిని విశ్వసించే వాళ్లు ఆయనతో ఉంటారు కదా అని సీసీ రెడ్డి ముక్తాయింపుగా అన్నారు.


Click it and Unblock the Notifications











