పవన్‌కి, నాకు అదే జరిగింది.. అస్సలు తట్టుకోలేం.. స్టార్ హీరోలకు చిరంజీవి స్వీట్ వార్నింగ్
తెలుగు సినీ తెరపై అలుపెరగని సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే 150 సినిమాలు పూర్తిచేసి దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు, సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న చిరుకి రాజకీయ అనుభవం కూడా ఉంది. సో తాజాగా తన సినీ, రాజకీయ అనుభవాలను రంగరిస్తూ తోటి స్టార్ హీరోలకు ఓ సలహా ఇచ్చారు మెగాస్టార్. ఆ వివరాలేంటో చూద్దామా..

ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరకు
సినిమాల్లో మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే చిరంజీవి రాజకీయ గడప తొక్కారు. 2008 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 సంవత్సరంలో 18 స్థానాలను కైవసం చేసుకున్నారు. చివరకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి తిరిగి సినీ గడప తొక్కారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ జనసేన.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య చిరు బాటలోనే నడిచి జనసేన పార్టీ స్థాపించారు. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని వెలికితీస్తానని చెప్పిన పవన్.. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ఈ రెండు విషయాలను పరిగణలోకి తీసుకొని తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి.

నాకు, పవన్‌కి అదే జరిగింది
తాను సినిమాల్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న సమయంలో ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, ప్రస్తుత రాజకీయాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు చిరు. ఇతర వ్యక్తులు డబ్బు కుమ్మరించడం కారణంగానే గతంలో నేను, ఇప్పుడు పవన్ ఓడిపోవడం జరిగిందని చెప్పారు. పాలిటిక్స్‌లో నిలవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

తోటి స్టార్ హీరోలకు సలహా
ఇలాంటి పరిస్థితుల నడుమ రాజకీయాల్లోకి రావొద్దని పేర్కొంటూ తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ లకు సలహా ఇచ్చారు చిరంజీవి. లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ విజయం సాధిస్తుందని భావించానని..కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయన్నారు. కుదిరితే రాజకీయాలకు దూరంగా ఉండండి అంటూ ఆయన సొంత అనుభవాలను రంగరించి కమల్, రజినీకాంత్ లకు సూచించారు చిరు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రూపంలో పోరాటం
అక్టోబర్ 2న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చిరు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రూపంలో బ్రిటిష్ వారిపై చిరంజీవి చేసిన పోరాట ఘట్టాలు హైలైట్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











