Twitter Blue Tick కోల్పోయిన తెలుగు తారలు.. ఆ హీరోలు మాత్రం సేఫ్.. అసలు ఏమైందంటే?
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సాధారణ వ్యక్తుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు సమాచార వేదికగా దీన్ని ఉపయోగిస్తున్నారు. తారలు అయితే మూవీ ప్రమోషన్స్, ఫంక్షన్స్ కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలకు షాక్ ఇచ్చింది మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ట్విటర్. సినీ సెలబ్రిటీలతో పాటు స్టార్ క్రికెటర్లు, రాజకీయ నాయకుల బ్లూ టిక్ మార్క్ ను తొలగించింది ట్విటర్. పూర్తి వివరాల్లోకి వెళితే..
అగ్ర హీరోలతోపాటు: తాజాగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ సినీ ప్రముఖుల అకౌంట్ కు ఉన్న బ్లూ టిక్ మార్క్ ను తొలగించింది. వారిలో అగ్ర హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యామ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య, అఖిల్, నితిన్, ప్రకాష్ రాజ్, మంచు మనోజ్ ట్విటర్ అకౌంట్స్ కు బ్లూ టిక్ తొలిగించారు.

ప్రకాష్ రాజ్ రియాక్షన్ : ఇక హీరోయిన్లలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత రూతు ప్రభు, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ సహా పలువురి బ్లూ టిక్స్ రిమూవ్ అయ్యాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణు అకౌంట్స్ కు బ్లూ టిక్స్ అలాగే ఉన్నాయి. వీరంతా ట్విటర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుని ఉంటారని సమాచారం. ఇదిలా ఉంటే బ్లూ టిక్ కోల్పోవడంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ "బై బై బ్లూ టిక్" అని ట్వీట్ చేశారు.
క్రికెటర్స్-పొలిటిషియన్స్ : టాలీవుడ్ సెలబ్రిటీలే కాకుండా షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అలియా భట్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, రజనీ కాంత్, విజయ్, శింబు వంటి పెద్ద సెలబ్రిటీలు సైతం ట్విటర్ బ్లూ టిక్ కోల్పోయారు. క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. రాజకీయ నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుల బ్లూ టిక్ మార్క్స్ కూడా మాయమయ్యాయి.

బ్లూ టిక్ కావాలనుకుంటే: ట్విటర్ లో పర్సనల్ అకౌంట్స్ కు, కంపెనీ అకౌంట్స్ కు వెరీఫైడ్ బ్లూ టిక్ లు సాధారణంగా ఉండేవి. తమ అకౌంట్స్ ను వెరీఫై చేసుకుని ఉచితంగా ఈ బ్లూ టిక్ పెట్టుకునే అవకాశం ఉండేది. కానీ బిజినెస్ మ్యాన్ ఎలన్ మస్క్ ట్విటర్ చేజిక్కుంచుకున్న తర్వాత ఆ వెరీఫైడ్ బ్లూ టిక్ లకు నిర్ణీత రుసుము చెల్లించాలనే నిబంధన పెట్టారు. బ్లూ టిక్ కావాలనుకునే వారు 8 నుంచి 11 అమెరికన్ డాలర్స్ చెల్లించాల్సి ఉంటుంది.
గడువు ముగింపు..: ఇండివిడ్యువల్ ట్విటర్ యూజర్లు తమ అకౌంట్లకు వెరీఫైడ్ బ్లూ టిక్ కావాలనుకుంటే వెబ్ కోసం అయితే నెలకు రూ. 650, యాప్ కోసమైతే రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికైతే రూ. 6500 డిస్కౌంట్ ఆఫర్ ను ట్విటర్ అందిస్తోంది. అంటే నెలకు రూ. 566 మేర తగ్గింపు ఉంటుంది. దీనికి తుది గడువును ఈ ఏడాది ఏప్రిల్ 20 వరకు విధించారు. ఈలోపు బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ తీసుకోనివారు దాన్ని కోల్పోతారు. ఈ గడువు గురువారం ముగియడంతో సెలబ్రిటీలు వరుసగా ట్విటర్ బ్లూ టిక్ లను కోల్పోతున్నారు.


Click it and Unblock the Notifications











