ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చిరంజీవి ట్వీట్: బ్రష్ పట్టి గోడలపై రాశానంటూ షాకింగ్ పోస్ట్
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. బడా హీరోల హవా చూపిస్తోన్న సమయంలోనే తన సత్తాను నిరూపించుకున్న ఆయన ఎన్నో విజయాలను అందుకున్నారు. అప్పటి నుంచి దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తున్నారు. ఇక సమాజంలో జరిగే విషయాలపై తరచూ స్పందిస్తూ ఉంటే చిరంజీవి.. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం పట్ల వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. అంతేకాదు, సుదీర్ఘమైన లేఖను వదిలారు. ఆ వివరాలు మీకోసం!

రీఎంట్రీలో దూకుడు.. పంథాను మార్చిన చిరు
సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందించడంతో పాటు ఆయనలోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నారాయన. ఈ క్రమంలోనే ఆ వెంటనే 'సైరా: నరసింహారెడ్డి' కూడా చేశారు.

‘ఆచార్య'లా మారిన చిరు.. మెగా మల్టీస్టారర్‌లో
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇందులో చరణ్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు.

ఒకటి రాకముందే... మరో మూడింటికి సిగ్నల్
'ఆచార్య' మూవీ పట్టాలపై ఉండగానే మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. దీని తర్వాత మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్'ను రీమేక్ చేస్తున్నారు. దీనికి మోహన్ రాజా దర్శకుడు. ఆ తర్వాత 'వేదాళం' రీమేక్‌ను మెహర్ రమేష్‌తో చేయబోతున్నారు. వీటితో పాటు ఓ తెలుగు కథతో బాబీ దర్శకత్వంలో మరో ప్రాజెక్టునూ లైన్‌లో పెట్టుకున్నారు.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చిరు ట్వీట్
నష్టాల బాటలో పయణిస్తోందన్న కారణంతో విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు సంస్థలకు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో దీనికి వ్యతిరేకంగా అందులో పని చేసే కార్మికులతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు సైతం పోరాటం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమకారులకు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

పోరాటం చేస్తున్న వాళ్లందరికీ మద్దతు అంటూ
విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు. 'విశాక ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ప్రకటిస్తున్నా. ఇది ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతమైన న్యాయ సమ్మతమైన హక్కు. దానిని మనం ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం' అని అందులో పేర్కొన్నారు.

అలా పోరాటం చేశానంటూ మెగాస్టార్ కామెంట్స్
ఇదే ట్వీట్‌లో 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైఎన్నార్ కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ పట్టి గోడల మీద ఆ నినాదాన్ని రాశాం. ధర్నాలు, నిరాహార దీక్షలు చేశాం. 35 మంది ప్రాణాలు కోల్పోయి సాధించిన తర్వాత సంబరాలు జరుపుకున్నాం' అంటూ చిరు చెప్పుకొచ్చారు.

వాళ్లకు దారాదత్తం.. కేంద్ర విరమించుకోవాలి
కేంద్ర ప్రభుత్వం గురించి చెబుతూ.. 'విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇన్నేళ్లైనా క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం.. అందువల్ల నష్టాలొస్తున్నాయనే సాకుతో ప్రైవేటు పరం చేయాలనుకోవడం సమంజసం కాదు. లక్షలాది మంది ఆధారపడిన ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతున్నాను' అంటూ మెగాస్టార్ రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











