మెగాస్టార్ చిరంజీవి 'శంకర్ దాదా జిందాబాద్' తరువాత ఏ సినిమాలోనూ నటించలేదు.అలాగని రాజకీయాల్లోకి రేపు వస్తున్నారు...ఎల్లుండి వస్తున్నారు అనే ఊహాగానాలకీ తెర వెయ్యలేదు. దాంతో ఈ పరిస్ధితిలో ఇక చిరంజీవి సినిమా లేనట్లే అని ఒక వర్గం ద్వారా ప్రచారం ప్రారంభమయ్యింది. కాని ముందుగా అనుకున్నట్లుగానే 'అధినాయకుడు' సినిమా హంగామా లేకుండా త్వరలో ప్రారంభమయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఈ సినిమాకి రాజకీయ, సామాజిక అంశాలను టచ్ చేస్తూ మాస్ ఎలిమెంట్లు మిళితం చేస్తూ పరుచూరి బ్రదర్స్ పూర్తి స్ధాయి స్క్రిప్టు రెడీ చేసారట. ఎన్ కౌంటర్ ఫేమ్ ఎన్. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రానున్నట్లు సమాచారం. చిరంజీవి శ్రేయాభిలాషులైన కె. రాఘవేంద్రరావు, సి. అశ్వనీదత్ లతో అల్లు అరవింద్, దీనిని నిర్మించబోతారని తెలుస్తోంది. హీరోయిన్, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.అంటే యన్టీఆర్ బొబ్బిలి పులి లాంటి పవర్ ఫుల్ చిత్రం వస్తుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. తాము అధినాయకుడు సినిమాకు స్క్రిప్టు సిద్ధం చేసినట్లు గతంలో ఒక సారి పర్చూరి వెంకటేశ్వర రావు చెన్నైలో చెప్పారు.