అల్లరి నరేష్ చిత్రం ఆడియోకి చిరంజీవి గెస్ట్
హైదరాబాద్ : అల్లరి నరేష్ తాజా చిత్రం 'యుముడికి మొగుడు'. ఈ చిత్రం టైటిల్ తో గతంలో చిరంజీవి హీరోగా చిత్రం వచ్చి విజయవంతం అయ్యింది. ఆ సెంటిమెంట్ తోనేమో చిరుని ఈ చిత్రం ఆడియోకి ఆహ్వానిస్తున్నారు. ఈ విషయం నిర్మాత అడ్డాల చంటి ఖరారు చేస్తూ... ''కథరీత్యా 'యుముడికి మొగుడు' అనే పేరు కుదిరింది. చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమా లోగోని ఆవిష్కరించాం. ఆయన చేతుల మీదుగా పాటల్ని విడుదల చేస్తున్నాం. మిగిలి ఉన్న పాటని స్విట్జర్లాండ్‌లో చిత్రిస్తున్నాము'' అన్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఆడియోను విడుదల చేయబోతున్నారు.
అల్లరి నరేష్ కథానాయకుడుగా ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'యముడికి మొగుడు'. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో చంటి అడ్డాల నిర్మించిన ఈ చిత్రంలో రీచాపనయ్ కథానాయికగా నటిస్తోంది. దర్శకుడు ఇ.సత్తిబాబు కథ గురించి చెపుతూ...ఈ చిత్రం కథలో యమలోకం వెళ్లిన అల్లరి నరేష్ ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. యమధర్మరాజు ఎలాంటి శిక్ష వేస్తాడో అని అందరూ భయం భయంగా వరుసలో నిలుచున్నారు. కానీ ఓ అల్లరి నరేష్ మాత్రం... యముడి కూతురిపై కన్నేశాడు. తండ్రి చాటుగా ఉన్న యమపుత్రికను తదేకంగా చూస్తూ ప్రేమ మైకంలోకి దించేశాడు. ఆ తర్వాత జరిగిన కథేమిటో తెరపైనే చూడాలంటున్నారు.
అలాగే ''తెలుగు తెరపైకి యముడి నేపథ్యంలో వచ్చిన చిత్రాలన్నీ చక్కటి విజయాన్ని సాధించాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ఇది. నరేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయే పాత్రను ఇందులో పోషిస్తున్నారు. 'అల్లుడా మజాకా'లోని 'అత్తో అత్తమ్మ కూతురో' పాటను ఇందులో రీమిక్స్ చేసి చూపిస్తున్నాం. యముడిగా సాయాజీషిండే, ఆయన భార్యగా రమ్యకృష్ణ పాత్రలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.
యముడిగా సాయాజీ షిండే, యముని భార్యగా రమ్యకృష్ణ కీలక భూమికలు పోషిస్తున్న ఈ చిత్రంలో గిరిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతిరావు, కృష్ణభగవాన్, రఘుబాబు, సుధ, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: జయసిద్ధు, మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: కోటి, కెమెరా: కె.రవీంద్రబాబు,ఎడిటింగ్: గౌతంరాజు, కళ: కిరణ్ కుమార్, నిర్మాత: చంటి అడ్డాల, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ. సత్తిబాబు.


Click it and Unblock the Notifications











