ఈ సారైనా రిలీజవుతుందా?
ఈ చిత్రం అంతా ఆగిపోయిందనుకున్న తరుణంలో త్వరలో విడుదల చేస్తున్నామంటూ నిర్మాత మీడియాకు తెలియచేసారు. అంతేగాక రిలీజ్ డేట్ పోస్టర్ కూడా విడుదల చేసారు. మే 25 రిలీజ్ అని ఉంది. అయితే ఆ పోస్టర్ క్రింద బిజినెస్ ఎంక్వైరీ అని ఉంది. అంటే ఇంకా బిజినెస్ కానట్లేగా అంటున్నారు.
ఇక తరుణ్ పూర్తిగా ఫేడవుట్ అయిపోయిన దశలో ఈ చిత్రం విడుదలకు రానుండటంతో ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. అయితే శృంగారం కలిసిన చిన్న చిత్రాలకు డిమాండ్ ఉందనే అభిప్రాయంలో మార్కెట్లో ఈ చిత్రాన్ని పెట్టినట్లు చెప్పుకుంటున్నారు.
నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ "విదేశీ నేపథ్యంలో కథ నడుస్తుంది. నేటి యువతకు ప్రేమ, పెళ్లి అనే విషయాలపై ఉన్న అవగాహన, అభిప్రాయాల్ని చూపించే ప్రయత్నమిది. తరుణ్ పాత్ర ఇప్పటి కుర్రాళ్లకు దగ్గరగా ఉంటుంది. చుక్కలాంటి చిన్నదానితో అతగాడు ఏం చేశాడన్నది తెర మీద చూస్తేనే బాగుంటుంది. అనూప్ అందించిన స్వరాలు కథకు బలాన్నిచ్చాయి. ఈ నెలలోనే చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము"అన్నారు.
ఇద్దరు దర్శకులు మారి ఫైనల్ గా కన్మణి దర్శకత్వం పేరుతో వస్తున్న ఈ చిత్రానికి రాజు హిర్వాణి, గోగినేని శ్రీనివాస్ నిర్మాతలు. గాయం-2 చిత్రంలో చేసిన విమల రామన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసింది.


Click it and Unblock the Notifications












