అమెరికాలో ఎన్టీఆర్‌పై నాణెం విడుదల
వాషింగ్టన్ : త్వరలో అమెరికాలో ఎన్టీఆర్ పై నాణెం విడుదల చేయనున్నారు. భారత చలన చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగాను, ఇండో ఆమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళాల సేకరణ నిమిత్తం విఖ్యాత నటుడు ఎన్టీఆర్‌పై నాణెం విడుదల చేయనున్నారు.
ఇక ఈ నాణెం ను ఈ నెల 28, 29 తేదీల్లో దీన్ని విడుదల చేస్తారు. ఈ నాణేనికి ఒకవైపు ఎన్టీఆర్ చిత్రం, మరోవైపు ఆసుపత్రి చిహ్నాలు ఉంటాయని దానిని రూపొందించిన గోల్డెన్ లైన్ సంస్థ ప్రతినిధులు నాగేశ్వరరావు, రామిరెడ్డి తెలిపారు.
తెలుగువారు "అన్నగారు" అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (1923 మే 28 - 1996 జనవరి 18) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 300 చిత్రాలలో నటించారు.
తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.
తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.


Click it and Unblock the Notifications












