కేసీఆర్‌కు పాఠాలు చెప్పా, ఇబ్బంది పెడితే విజయవాడకు ఉత్తరం: కమెడియన్ అలీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాన్ని బేస్ చేసుకుని రూపొందుతున్న మరో చిత్రం 'తెలంగాణ దేవుడు'. శ్రీకాంత్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో జిషాన్ ఉస్మాని, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మాక్ ల్యాబ్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై.. మొహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించగా, హరీష్ వడ్‌త్యా దర్శకత్వం వహించారు.
ఇటీవల జరిగిన ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకలో కమెడియన్ అలీ సినిమాలో తన పాత్ర గురించి వెల్లడించారు. ఈ చిత్రంలో పాఠాలు చెప్పే మాస్టారు పాత్ర పోషించినట్లు చెప్పిన అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిన్నతనంలో కేసీఆర్‌కు పాఠాలు
‘‘తెలంగాణ దేవుడు అనే టైటిల్ చెప్పగానే... ఆ దేవుడు కేసీఆర్ గారు అని తెలిసిపోయింది. ఈ సినిమాలో కేసీఆర్ గారికి చిన్నతనంలో పాఠాలు చెప్పిన తెలుగు మాస్టారు పాత్రలో నటించాను.'' అలీ వెల్లడించారు.

పూత రేకుల గురించి తెలియక...
సినిమాలో ఓ కుర్రాడు నా దగ్గరకు వచ్చి రాత్రి ఒక సినిమా చూసొచ్చాను మాస్టారూ... పాటలో పూత రేకులు అని ఉన్నాయి, పూత రేకులు అంటే ఏమిటి? అని అడుగుతాడు. నాకు ఇనుప రేకులు తెలుసు, సిమెంట్ రేకులు తెలుసు, పూల రేకులు కూడా తెలుసు, ఈ పూతరేకులు ఏంటో నాకు కూడా తెలియదు అని మాస్టారుగా నేను సమాధానం ఇచ్చే సీన్ ఆసక్తికరంగా ఉంటుందని అలీ తెలిపారు.

ఇబ్బంది పెట్టడంతో విజయవాడకు ఉత్తరం
అదేంటి మాస్టారూ.. మీరు బోలెడంత చదువుకున్నారు, పూత రేకులు మీకు తెలియక పోవడం ఏమిటి? అని ఆ కుర్రాడు అడగటంతో రేపు రా తెలుసుకుని చెబుతాను అని సమాధానం చెబుతాను. ఆ కుర్రాడు ప్రతి రోజూ వచ్చి పూతరేకుల గురించి అడిగి ఇబ్బంది పెడుతుండటంతో.... చివరకు నేను విజయవాడలో ఉండే నా స్నేహితుడికి ఉత్తరం రాసి పూతరేకులు అంటే ఏమిటో తెలుసుకుంటాను.... ఈ సన్నివేశం ప్రేక్షకులను మెప్పిస్తుందని అలీ తెలిపారు.

తెలంగాణ దేవుడు
ఈ సినిమాలో కేసీఆర్ పాత్ర పోషించిన శ్రీకాంత్ మాట్లాడుతూ... ఈ సబ్జెక్ట్ నా వద్దకు వచ్చినపుడు దానికి న్యాయం చేయగలనో లేదో అని ఆలోచనలో పడ్డాను. ఇలాంటి గొప్ప పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణలో దేవుడుగా భావించే వ్యక్తి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు సినిమాలో ఉంటాయన్నారు.


Click it and Unblock the Notifications











