హాస్య నటుడు సునీల్ హీరోగా నిలబడతాడా?
ఎస్.ఎస్. రాజమౌళితో చేస్తున్న 'మర్యాదరామన్న' చిత్రం హీరోగా తనకి బ్రేక్‌నిస్తుందనే పూర్తి నమ్మకంతో సునీల్ ఉన్నారు. గతంలో 'అందాలరాముడు'లో హీరోగా నటించినప్పటికీ ఆ తర్వాత అలాంటి ఆఫర్స్ వచ్చినా అంగీకరించలేదు. అందులోనూ 'అందాలరాముడు'లో సునీల్ పాత్ర అతని రెగ్యులర్ కామిడికీ పొడిగింపుగానే ఉంటుంది. అయితే 'మర్యాద రామన్న'లో మాత్రం హీరోయిజం కనిపించే పాత్రని చేస్తున్నారని సమాచారం. ఈ పాత్ర పోషణ కోసం రాజమౌళి సూచన మేరకు సునీల్ బాగాబరువు తగ్గారు. గత చిత్రాల్లో ముద్దుగా, బొద్దుగా కనిపించే సునీల్ ఇప్పుడు సన్నబడ్డాడు. కమేడియన్ గా వందలాది చిత్రాల్లో నటించి, ఆర్థికంగా బాగా స్థిరపడడంతో ఇక ముందు కేవలం హీరోగానే నటించాలని, ఇతర చిన్నాచితక పాత్రలు వేయకూడదని సునీల్ నిర్ణయించుకున్నారని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. అది దృష్టిలో పెట్టుకునే చాలా చిత్రాలలో కామిడీ పాత్రలను సునీల్ సున్నితంగా తిరస్కరించారని చెప్పుకుంటున్నారు. అయితే అగ్రహీరోలు, తనకు సన్నిహితులైన వారితో మాత్రం కలిసి నటిస్తున్నారు. ఇదంతా తన స్నేహితుడు ప్రముఖ రచయిత, దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచనల మేరకేనని చెప్పుకుంటున్నారు. అయితే సునీల్ కమేడియన్ గానే బావుంటాడని, తమిళంలో వివేక్ ఇలాంటి ప్రయోగం చేస్తే ఏమైందో అందరికీ తెలిసిందేనంటూ పరిశ్రవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











