‘నాయక్’ సినిమాపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'నాయక్' సినిమాపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు అందింది. ఈ సినిమాలో విలన్ పాత్రకు తన పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కంప్లైంట్ చేసారు.
నాయక్ చిత్రంలో విలన్ పేరు మార్చాలంటూ విశాఖ జిల్లా మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ గతంలోనే ఆందోళనకు దిగారు. చిత్రంలో విలన్ పాత్రకు తన పేరును పోలిన పేరు ఉండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ఆ పేరును ఉద్దేశ్యపూర్వకంగానే పెట్టినట్లుగా బాబ్జీ అభిప్రాయపడ్డారు. క్షణమే పేరు మార్చాలని అతను నిర్మాతను, దర్శకుడిని కోరారు. లేదంటే దర్శకుడి పైన తాను క్రిమినల్ కేసు పెట్టేందుకు కూడా వెనకాడనని హెచ్చరించారు.
అయితే గండి బాబ్జీ ఆందోళనపై.... నాయక్ సినిమా యూనిట్ సభ్యులు ఎవరూ స్పందించ లేదు. కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వ లేదు. దీంతో గండి బాబ్జీ సెన్సార్ బోర్డును ఆశ్రయించక తప్పలేదు. మరి సెన్సార్ బోర్డు ఈయన ఫిర్యాదుపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఆ సంగతి పక్కన పెడితే.... జనవరి 9న విడుదలైన 'నాయక్' చిత్రం ఈ నెల 15తో వారం రోజులు పూర్తి చేసుకుని కలెక్షన్ల విషయంలో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఏపీలో తొలి వారంలో రూ. 26.39 కోట్ల షేర్ సాధించడంతో, రెస్టాఫ్ ఇండియాతో కలుపుకుని రూ. 30.49 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పించింది.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మించింది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











