హీరోయిన్ ఛార్మి ట్వీట్...చిరంజీవి 150 మూవీ గురించేనా?
హైదరాబాద్: హీరోయిన్ ఛార్మి తన ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ''చిరు అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలో ఓ విషయం చెప్పబోతున్నాను. నా ద్వారానే ఆ విషయం లీక్ అవ్వాలని ఉంది' అని చార్మీ తన ట్విట్టర్లో పెట్టింది. చిరు అభిమానులకు గుడ్ న్యూస్ అంటే.. అది ఖచ్చితంగా ఈ మెగాస్టార్ చేయబోయే 150వ చిత్రం గురించే అయ్యుంటుందని అంతా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఛార్మి..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘జ్యోతి లక్ష్మి' సినిమా చేస్తోంది. చిరంజీవి 150వ సినిమాకు కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని, దానికి ‘ఆటో జానీ' అనే టైటిల్ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. పూరితో సన్నిహితంగా మెలుగుతున్న నేపథ్యంలో చార్మికి చిరంజీవి 150వ సినిమా గురించిన తెలిసి ఉంటుందని, ఆ విషయాన్నే ఆమె ట్విట్టర్ ద్వారా ఊరిస్తున్నట్లు టాక్.
ఛార్మి నటిస్తున్న ‘జ్యోతి లక్ష్మి' సినిమా విషయానికొస్తే....
ఛార్మి ముఖ్య పాత్రలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న సినిమా ‘జ్యోతి లక్ష్మి'. సి.కె.ఎంటర్టెన్మెంట్స్, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ పతాకాలపై శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జ్యోతి లక్ష్మి' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల చేసారు.

ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...జ్యోతి లక్ష్మి చిత్రం ‘మిసెస్ పరాంకుశం' నవల ఆధారంగా తెరకెక్కించాను. ఈ సుప్రసిద్ధ నవలను ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసారు. దాదాపు ఆరేళ్ల నుండి ఈ సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికి వీలైంది. ఈ ట్రెండుకు తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసి సినిమాను తీసాం. గోవా, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ఈ సినిమా విషయంలో నాకు సపోర్టు చేసిన అందరికీ థాంక్స్ అన్నారు.
జ్యోతి లక్ష్మి సినిమా యూత్ ఫుల్, ఎమోషనల్, రొమాంటిక్ మూవీ అని నిర్మాతలు అంటున్నారు. ఈచిత్రం ఆడియోను మే చివరి వారంలో విడుదల చేసి జూన్ మొదటి వారంలోగానీ, రెండో వారంలోగానీ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో చార్మి టైటిల్ రోల్ చేస్తుండగా, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











