»   » పవన్‌తో విభేధాల వెనక అసలు కథ: పూరీ జగన్నాథ్ (ఫోటోలు)

పవన్‌తో విభేధాల వెనక అసలు కథ: పూరీ జగన్నాథ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్యన పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ మధ్యన విభేధాలు వచ్చాయంటూ మీడియాలో వరసగా వార్తలు వచ్చాయి. ఇదే విషయమై పూరీ మరో సారి క్లారిఫై చేసారు. విభేధాలు అనేది మీడియా సృష్టే అని కొట్టి పారేసారు. ఆదివారం ప్రసారం అయిన ఏబీఎన్ ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ చేసిన ఓపెన్‌హార్ట్ పోగ్రామ్ లో మాట్లాడుతూ క్లారిఫై ఇచ్చారు. అలాగే పలు విషయాలపై మాట్లాడారు.

పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ... నేను 'ఇద్దరమ్మాయిలతో..' ప్రమోషన్ కోసమని ఛానెళ్లలో ఇంటర్వ్యూలిస్తున్నా. ఒక కాలర్ 'పవన్‌తో సినిమా వచ్చే ఏడాది ఉంటుందా..' అన్నారు. 'ఉండచ్చు..' అన్నా. దాన్ని పట్టుకొని మరో కాలర్ 'అందులో హీరోయిన్ ఎవరు..' అన్నారు. అలాఅలా పదిహేను ఛానళ్లలో పవన్‌తో సినిమా అనేది టాపిక్కయి కూర్చుంది. అప్పుడు దక్కన్ క్రానికల్ వాళ్లొచ్చి తర్వాత సినిమాలో పవన్నెలా చూపిస్తారు.. అనడిగారు. విసుగొచ్చి 'అయినప్పుడు చూద్దాం' అని చెప్పా. దాన్ని నేను పవన్‌తో సినిమా చెయ్యను... అని రాసేశారు. అదీ కథ అన్నారు.

ఓ 85 కోట్లు డబ్బు పోగొట్టుకున్నాని చెప్తూ... అంత డబ్బు పోతే డిప్రెషన్‌లోకి వెళ్తారు ఎవరైనా..డిప్రెషన్‌లోకి వెళితే ఇంకా లోపలికెళ్లిపోతాం. మళ్లీ ఇళ్లుగిళ్లు కావాలంటే ఎలా వస్తాయి? మళ్లీ సినిమాలు రాయాలి, తియ్యాలి. దానికోసం ఫ్రెష్‌గా ఉండాలి. ఇంకా ఎక్కువ ఎక్సర్‌సైజ్ చెయ్యాలి. ఫిట్‌నెస్ ఒక్కటే మనల్ని కాపాడుతుంది అన్నారు.

పూరీ ఇంటర్వూలో చెప్పిన మిగతా విషయాలు స్లైష్ షోలో...

నాగార్జున గారు అలా...

నాగార్జున గారు అలా...

నాగార్జునగారు ఒక మంచిమాట చెప్పారొకసారి. 'ఏరా భోంచేశావా అని అడిగేవాడుంటాడు, ఏరా సంపాదించి జాగ్రత్త చేసుకున్నావా అని అడిగేవాడుంటాడు. కాని ఎక్సర్‌సైజ్ చేశావా అని ఎవ్వరూ అడగరు' అని. ఆ ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి. నన్నాయన రోజూ ఎక్సర్‌సైజ్‌కు తీసుకెళ్లేవారు. నాగార్జునగారితో వెళ్లడం కిక్ అని వెళ్లానుగాని, సీరియస్‌గా తీసుకునేవాణ్ని కాదు. అది చూసి ఆయనలా చెప్పారు. అది నాకు చాలా పనికొచ్చింది అన్నారు.

నన్ను ప్రభావితం చేసింది

నన్ను ప్రభావితం చేసింది

బాలచందర్, మణిరత్నం సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అవుతాను. రామ్‌గోపాల్‌వర్మ సినిమాలు కాదుగాని ఆయనతో కూర్చుని మాట్లాడ్డం బాగా ఇష్టం. గంటల తరబడి ఆయన చెబుతారు, నేను వింటుంటాను.

పోకిరి గురించి..

పోకిరి గురించి..

పోకిరి అంత పెద్ద హిట్టవుతుందని నేనూ అనుకోలేదు. మహేష్‌బాబూ అనుకోలేదు. నా దగ్గరున్న కొన్ని కథల్లో అదీ ఒకటి. అంతే. మంచి సినిమా అవుతుందనుకున్నాం. ఎడిటింగ్ అప్పుడు నా పక్కనున్నవాళ్లు ఫ్లాపవుతుందని అందరూ అనేవాళ్లు. ఎందుకంటే ఇందులో ఆడవాళ్లు లేరు, ఫ్యామిలీ లేదు... సినిమా నిండా గన్నులే... అని. -

వాడు పిచ్చోడే...

వాడు పిచ్చోడే...

నిజానికి పోకిరి తర్వాత మూడేళ్ల పాటు ఏ సినిమా తీసినా 'పోకిరిలా లేదు..' అనడం మొదలెట్టారు. అసలు అంత బాగా నేనేం తీశానా అని మళ్లీ ఆ సినిమా చూశాను. నిజం చెబుతున్నా, నాకైతే ఏమీ అర్థం కాలేదు. ఏదైనా సినిమా ఎందుకు హిట్టవుతుందో, ఎందుకు నచ్చుతుందో ఎవరికీ తెలియదు. అలా ఎవరైనా 'నాకు తెలుసు, నాకు రాయడం వచ్చేసింది' అంటే వాడు పిచ్చోడే.

అదో ఎదవ అలవాటు...

అదో ఎదవ అలవాటు...

పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కి అలవాటు పడ్డారంటూ గత కొంతకాలంగా మీడియాలో,ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ విషయమై పూరీ జగన్నాథ్ నే డైరక్ట్ గా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారా? అని అడగటం జరగింది. దానికి ఆయన సమాధానమిస్తూ...'లేదు. గడచిన మూడేళ్లుగా రెగ్యులర్‌గా తాగడం మొదలెట్టాను. మా గురువుగారు రామ్‌గోపాల్‌వర్మ పుణ్యమాని ఆయనతో కూర్చుని తాగుతున్నా. అదో పెద్ద ఎదవలవాటు.' అన్నారు.

డ్రగ్ ఎడిక్ట్ ని కాదు

డ్రగ్ ఎడిక్ట్ ని కాదు

డ్రగ్స్‌కు అడిక్ట్ అయ్యారనే ప్రచారం జరిగిందనే విషయం గురించి చెప్తూ...అలా అయితే మళ్లీ రాలేను కదా ? నా బ్రెయినే నా పెట్టుబడి. దాన్ని పాడు చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? నాకు తెలిసి జీవితం ఎవ్వర్నీ వదిలిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది. అది అందరికీ కొద్దికొద్దిగా అర్థమవుతూ ఉంటుంది అన్నారు.

బ్యాంకాక్ అంటే ఎందుకంత ఇష్టం

బ్యాంకాక్ అంటే ఎందుకంత ఇష్టం

బ్యాంకాక్ కాదు, పట్టాయా బీచ్‌లో కూర్చుని రాసుకోవడం ఇష్టం. 'ఇడియట్' సినిమా అప్పుడు మొదటిసారి వెళ్లాను. నాకది చాలా నచ్చింది. ఒక ముసలమ్మ, ఆమె కుటుంబం కాఫీ, టీల్లాంటివి అందిస్తారు. మొత్తానికి ఒక పర్సనల్ అటాచ్‌మెంట్ వచ్చేసింది.

టాటూ ల గురించి...

టాటూ ల గురించి...

టాటూ అనేది అడిక్షన్. ఒకటి వేస్తే రెండోది ఎక్కడ వేయించుకుందామా అనిపిస్తుంటుంది. నేను మొదటిది గోవాలో వేయించుకున్నాను. అది చైనా భాషలో లవ్. ఎందుకో చైనా అక్షరాలంటే నాకిష్టం. నేను వేయించుకున్న రెండో టాటూకు స్పానిష్‌లో 'లెవెంత్ మైల్' అని అర్థం. మన లక్ష్యం పది మైళ్లయితే, పదకొండు మైళ్లు పరిగెత్తమని చెబుతుంది అది. ఇంకోటి 'నాట్ పర్మనెంట్' అని. కష్టాల్లో ఉన్నా డబ్బున్నా లేకపోయినా, ఆఖరికి ప్రేమలో ఉన్నా - 'ఈ క్షణం శాశ్వతం కాదు' అని మనకు గుర్తు చేస్తుందది. సింపుల్‌గా చెప్పాలంటే 'ఒళ్లు దగ్గర పెట్టుకోమని'.

దేముడు గురించి...

దేముడు గురించి...

నేను దేవుడున్నాడని నమ్ముతాను. ఏదో ఒక శక్తి ఉంది. నాకు బాగా ఇష్టమైన టాపిక్ దేవుడు. నాకేమీ పని లేనప్పుడు 'ఎవడీడు, ఎక్కణ్నుంచి వచ్చాడు, మనల్ని ఒక్కొక్కర్నీ ఒక్కొక్కలాగా పుట్టించి అతనేం కావాలనుకుంటున్నాడు? ఏమీ కాకపోతే ఇంత డ్రామా ఎందుకు...' ఇలా ఆలోచిస్తుంటా. దేవుడి దృష్టిలో అన్ని ప్రాణులు ఒకటే. ఎవరెవరు ఏం చేశారో చిట్టాలు రాసుకుని, స్వర్గం నరకం మెయింటెయిన్ చేస్తూ - అలాంటి పాకీ పనులు దేవుడు చెయ్యడు.

ఆ రోజు ఏడ్చాను..

ఆ రోజు ఏడ్చాను..

నేను కష్టాలు, సుఖాలు అన్నీ చూశాను. కన్నీళ్లు పెట్టుకున్నాను. సంపాదించిన ఇళ్లూవాకిళ్లూ అన్నీ పోయి, వాటిని అమ్ముకుని అప్పులు తీర్చుకున్న రోజులు. నా దగ్గర పది కుక్కలుండేవి. వాటి ని పోషించలేక ట్రెయినర్‌కిచ్చేశాను. ఆ రోజు చాలా ఏడ్చాను.

అలా మొదలైంది...

అలా మొదలైంది...

అప్పట్లో 'శివ' పెద్ద హిట్టు. బయటికొచ్చి చూస్తే రామ్‌గోపాల్‌వర్మ పేరు కన్పించింది. ఆయనకు దగ్గరగా ఉన్నది కృష్ణవంశీ. ఆయనతో స్నేహం మొదలెట్టాను. పని అడగలేదు. ఆయనే నన్ను 'వర్మ క్రియేషన్స్'లోకి అసిస్టెంట్‌గా తీసుకున్నారు, తర్వాత రాముగారితో పనిచేశాను.

పవన్ తో అపాయింట్ మెంట్...

పవన్ తో అపాయింట్ మెంట్...

పవన్ కళ్యాణ్ స్టారయ్యాక ఆయనతో సినిమా చేద్దామని ఆయన మేనేజర్ చుట్టూ తిరిగాను. దూరదర్శన్ పరిచయంతో శ్యామ్ కె. నాయుణ్ణడిగితే ఛోటా కె. నాయుడికి చెప్పారు. ఆయనకు పవన్ కళ్యాణ్ బాగా ఫ్రెండ్. 'మంచి కథ చెప్పకపోతే నా పరువు పోతుంది. ముందు నాకు చెప్పమను' అన్నారట ఛోటా. అప్పుడాయనకు 'శ్రావణి సుబ్రమణ్యం' కథ చెప్పా. ఆయనకు నచ్చి పవన్ దగ్గరకు పంపిస్తే ఆయన నాకు అరగంటే సమయమిచ్చారు.

బద్రి కథ చెప్పా...

బద్రి కథ చెప్పా...

ఉదయం నాలుగ్గంటలకు నేను వెళ్లి 'బద్రి' కథ చెప్పాను. ఏకంగా నాలుగు గంటల పాటు! క్లైమాక్స్ నచ్చలేదు మార్చమన్నారు. కొంత ప్రయత్నించాను కాని నాకే నచ్చలేదు. వారం తర్వాత కలిసినప్పుడు మళ్లీ అదే చెప్పాను. 'నా గురించి నువ్వు క్లైమాక్స్ మారుస్తావా లేదా చూద్దామని అలా అడిగాను. ఇదే బాగుంది' అన్నారు పవన్. అలా వచ్చింది అవకాశం. 'ఛోటాకు చెప్పిన కథ వేరేలా ఉందే' అన్నారాయన తర్వాత. అవకాశం పోతుందని ఆయనకది చెప్పానని నిజం చెప్పేశాను. నిజానికి నేనా సినిమా చేసేనాటికి ఆయన నటించిన సినిమాలేవీ చూడలేదు.

దాసరి గారు చెప్పారు...

దాసరి గారు చెప్పారు...

ఒకసారి దాసరిగారు 'చిన్న సినిమాలు తియ్యవా..' అనడిగారు. 'వచ్చినవి చేస్తున్నా..' అంటే, 'ఒకరోజు మనకే ఫోన్లూ రావు, ఎవ్వరూ పలకరించరు. అప్పుడు తియ్యాల్సినవి చిన్న సినిమాలే. అవి తియ్యడమూ నీకు తెలియాలి..' అన్నారు. గారడీవాడికి నాలుగైదు ఫీట్లు వస్తాయి. అవే చేస్తుంటే ఊళ్లోవాళ్లు చూడరు. అందుకని అప్‌డేట్ అవాలి.

'హార్ట్ఎటాక్' గురించి...

'హార్ట్ఎటాక్' గురించి...

లేటెస్ట్‌గా 'హార్ట్ఎటాక్' తీశా .బానే ఉంది. యూత్‌కు బాగా నచ్చింది. నేనే ప్రొడ్యూసర్ని. నాకు నచ్చిన ఆలోచన ఇతరులకు నచ్చకపోవచ్చు, నమ్మకపోవచ్చు. నేను పడ్డ అవమానాల వల్ల నాకే సొంతంగా సంస్థ ఉండాలని పెట్టుకున్నా.

English summary
To keep the controversy with Pawan in low tension, Puri clarifying the news as just scrap.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu