సినీ కార్మికుల కోసం చిరంజీవి నేను సైతం.. భారీ విరాళం ప్రకటించిన మెగాస్టార్
తెలుగు ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన స్పందించే మెగా ఫ్యామిలీ.. తాజాగా కరోనావైరస్ కాటుతో బాధపడుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకొనేందుకు మరోసారి సిద్ధమైంది. గురువారం ఉదయమే మెగా బ్రదర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ విరాళంతో ముందుకు రావడం... అదే స్ఫూర్తితో మెగా హీరోలు తెలుగు ప్రజలకు చేయూతనివ్వడానికి ముందడుగు వేయడం చకచకా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రుడికో నూలుపోగు లాగా తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఓ ప్రకటనలో చిరంజీవి స్పందిస్తూ..
Recommended Video

కోటి రూపాయల విరాళం
కరోనావైరస్ మహమ్మారిని తుదముట్టించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. ఈ ఆపద కాలంలో నా వంతు బాధ్యతగా సినీ కార్మికుల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం అందిస్తున్నాను అని చిరంజీవి తెలిపారు.

ఆర్థికంగా బాధపడే కార్మికుల కోసం
కరోనావైరస్ కారణంగా షూటింగ్‌లు రద్దుతో ఆర్థికంగా బాధపడే సినీ కార్మికులకు అండగా నిలవాలనే భావించాను. రోజువారి వేతన కార్మికులకు అవసరమయ్యే విధంగా ఖర్చు చేస్తాం. సినిమా పరిశ్రమలో పనిచేసే దిగువ ఆదాయ వర్గాలకు చేయూతనందించే క్రమంలోనే ఆర్థికంగా అండగా నిలచే ప్రయత్నం చేస్తున్నాను అని చిరంజీవి తెలిపారు.

ప్రతీ ఒక్కరు ముందుకు రావాలి
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యహారించాల్సి ఉంటుంది. ఈ ఆపద నుంచి ప్రజలను, ప్రభుత్వాలను గట్టేక్కించేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలి. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని తమకు తోచిన విధంగా విరాళాలు అందించాలని కోరుతున్నాను అని తన సందేశంలో చిరంజీవి పేర్కొన్నారు.

కదిలిన టాలీవుడ్ ప్రముఖులు
కరోనాపై పోరాటానికి సినీ ప్రముఖుల స్పందించడంతో విరాళాల వెల్లువ మొదలైంది. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాంచరణ్, కొరటాల శివ, దిల్ రాజు, అల్లరి నరేష్ తదితర ప్రముఖులు భూరి విరాళాలను ప్రకటించారు. పలువురు ప్రముఖులు తమ విరాళాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.


Click it and Unblock the Notifications











