అనుష్క, ప్రియమణిలపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
హైదరాబాద్: హీరోయిన్లు అనుష్క, ప్రియమణిలు సినిమాల్లో అసభ్య వస్త్ర ధారణతో నటిస్తున్నారని, వారి మూలంగా సమాజంలోకి చెడు సంకేతాలు వెలుతున్నాయని సుబద్ధి అనే వ్యక్తి మల్కాజ్ గిరి కోర్టులో ప్రైవేట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ పిటీషన్‌పై మల్కాజ్ గిరి కోర్టు స్పందించింది.
అనుష్క, ప్రియమణిలపై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. మల్కాజ్ గిరి కోర్టు ఆదేశాల మేరకు ఈ ఇద్దరు హీరోయిన్లపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే ఇద్దరు హీరోయిన్లు నోటీసులు అందుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కేసుపై అనుష్క, ప్రియమణి ఎలా ప్రొసీడ్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
సినిమాల్లో వీరి వస్త్రధారణ అభ్యంతరకరంగా ఉందని, ఒక రకంగా సమాజంలో మహిళలపై పురుషులు దాడులు చేయడాని పరోక్షంగా కారణం అవుతోందని పిటీషనర్ పేర్కొన్నారు. అంతే కాకుండా సినిమాల్లో వస్త్రదారణ విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.
సినిమాల్లో అసభ్య కరమైన సన్నివేశాలు ఉంటే సెన్సార్ బోర్డు వాటిని కత్తిరిస్తుంది. సన్నివేశాల తీవ్రతను బట్టి సంబంధిత వయసు వారు మాత్రమే చూడదగ్గ సినిమా రేటింగ్ జారీ చేస్తుంది. అనుష్క, ప్రియమణి మాత్రమే కాకుండా చాలా మంది హీరోయిన్ల వస్త్రధారణ ఈ తరం సినిమాల్లో అసాధారణంగానే ఉంటోంది. మరి ఇలాంటి సీన్లను అనుమతిస్తున్న సెన్సార్ బోర్డును, ఇలాంటి సీన్లు చేయిస్తున్న దర్శకులను తప్పుపట్టకుండా కేవలం హీరోయిన్లనే టార్గెట్ చేయడం ఏమిటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











