షాక్:'అత్తారింటికి దారేది' పైరసీ సూత్రధారుడు ఇతడే
హైదరాబాద్:'అత్తారింటికి దారేది' సినిమా పైరసీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తుల్ని పోలీసులు మంగళవారం సాయంత్రం గుర్తించినట్లు సమాచారం. నిర్మాత కార్యాలయంలో పని చేస్తున్న ఓ వ్యక్తి తన స్నేహితునికి డీవీడీ ఇస్తే అది మరొకరి ద్వారా కృష్ణా జిల్లా పెడనలో ఓ ఇంటర్నెట్ కేంద్రానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ దిశగా దర్యాప్తు జరిపిన పోలీసులు పైరసీకి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం...'అత్తారింటికి దారేది' సినిమా ప్రొడక్షన్ యూనిట్ కు సంబంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఆఫీసులో పని చేసే ప్రొడక్షన్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ ఈ పైరసీకి కీలక పాత్రధారి అని తేలింది. అరుణ్ కుమార్ సినిమాకు సంబంధించిన సి.డి ని ఏ.పి.పి.ఎస్.సి కానిస్టేబల్ కు అందచేయటంతో అది కృష్ణా జిల్లా పెడనలో ఓ ఇంటర్నెట్ కేంద్రానికి వెళ్లటంతో అక్కడ నుంచి పైరసీ ప్రింట్ల రూపంలోకి వచ్చి ఆన్ లైన్ కి ఎక్కింది.
ఇక సినిమా లీకయిన విషయాన్ని ఆదివారం రాత్రి గుర్తించిన సినిమా నిర్మాత పోలీసుల దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే పోలీసులు, చలన చిత్ర వాణిజ్య మండలికి చెందిన వ్యక్తులు విచారణ చేపట్టారు. ఆఫీసుకు చెందిన వ్యక్తి ద్వారానే సినిమా బయిటకు రావటంతో సినీ పరిశ్రమ షాక్ కు గురి అయ్యింది. ఇక నుంచి తమ అఫీసుల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












