'కేరళ స్టోరీ'పై నిషేధం వివాదం.. కేరళ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
విడుదలకు ముందే వివాదాలకు ఆజ్యం పోస్తోంది 'ది కేరళ స్టోరీ'. ఐసిస్ టెర్రర్ నేపథ్యంలో రూపొందించిన కథే 'ది కేరళ స్టోరీ'. సాధారణ కాలేజీ అమ్మాయిలు టెర్రర్ ఊబిలోకి ఎలా దిగారు, ప్రపంచ వినాశనాన్ని కోరుకునే ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేరిన అమ్మాయి జీవితం ఎలా సాగిందనే నిజజీవిత ఘటనలపై 'ది కేరళ స్టోరీ' తెరకెక్కింది.
కేరళలో కొందరు కాలేజీ అమ్మాయిలను బ్రెయిన్ వాష్ చేసి మతమార్పిడికి ప్రేరేపించి భారత్ సహా ప్రపంచంలోని ఇస్లామిక్ టెర్రర్ మిషన్లలో ప్రవేశించిన సుమారు 32 వేల మంది మహిళల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథను తీర్చిదిద్దారు. రాడికలైజ్ అయిన అమ్మాయిల ట్రాప్ వెనక లోతైన విషయాలను తెరపై ఆవిష్కరించారు.

ఈ మూవీ విడుదలకు ముందే అనేక వివాదాలకు దారితీసింది. కావాలనే కేరళ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి స్పందించారు.
సెంట్రల్ సెన్సార్ బోర్డు ఒక సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, రాష్ట్రాలు ఆ మూవీ ప్రదర్శనలో జోక్యం చేసుకోలేవని కేరళ మంత్రి సాజీ చెరియన్ తాజాగా వ్యాఖ్యానించారు. అలాగే 'ది కేరళ స్టోరీ' చిత్రాన్ని నిషేధించడం ఈ సమస్యకు పరిష్కారం కాదని చెప్పుకొచ్చారు. సినిమాపై నిషేధం విధించడం, భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయడం వల్ల ఎదురుదెబ్బ తప్పదని సామాజిక, సాంస్కృతిక కార్యకర్తలు అంటున్నారు.

రాష్ట్ర సెక్యులర్ ఫ్యాబ్రిక్ ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రజలే బహిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ అన్నారు. ఈ సినిమాను ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ మత ప్రచారానికి ఉపయోగించుకుంటాయని ఆయన చెప్పారు. 'ది కేరళ స్టోరీ' చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఇందులో అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ తదితరులు నటించారు. ఈ మూవీ మే 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











