పర్చూరులోని బొమ్మల సెంటర్ లో శనివారం రాత్రి ఒక్కమగాడు సినిమా కటౌట్ లో హీరో బాలకృష్ణ తల భాగాన్ని కోసేసిన ఘటన ఉద్రిక్తలకు దారి తీస్తోంది. ఈ ఘటన అనంతరం బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం నాయకులు భారీ ఎత్తున రాస్తారోకో చేసి కటౌట్ ను కట్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కటౌట్ కటింగ్ కు సంబంధించి పోలీసులు నలుగురుని అరెస్ట్ కూడా చేశారు. అరెస్టు అయిన నిందితులలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న తెలుగు యువత పర్చూరు పట్టణ అధ్యక్షుడు కావడం అందరినీ విస్మయం చేసింది. అయితే ఇతను కాపు కులానికి చెందినవాడు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా బాలకృష్ణ కటౌట్ ను అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బాలకృష్ణ అభిమానులు ధర్నా చేసిన చోటే చిరంజీవి అభిమానులు రాస్తారోకో చేశారు. అంతటితో ఆగకుండా ఆ సెంటర్లో ఏర్పాటు చేసిన చిరుత కటౌట్ ను ఆయన అభిమానులు, గ్రామ పెద్దలు కలిసి స్వచ్ఛందంగా తొలగించారు. బాలకృష్ణ కటౌట్ ను కూడా అదే విధంగా తొలగించాలని చిరంజీవి అభిమానులు డిమాండ్ చేశారు. మూడు రోజుల తర్వాత తొలగిస్తామని బాలకృష్ణ అభిమానులు స్పష్టం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి అభిమానులను చెదరగొట్టారు. ఆ ప్రాంతంలో పోలీసులు పికెట్ ను ఏర్పాటు చేశారు.