Miss World 2024: ప్రపంచ సుందరిగా క్రిస్టినా పిజ్కోవా.. కన్నడ భామకు ఎన్నో స్థానం వచ్చిందంటే!
మోడలింగ్ రంగంలో ఎంతో మంది అమ్మాయిలు తమ అందచందాలతో మాయ చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాల్లో అసలైన అందగత్తెను ఎంపిక చేసేందుకు ఎన్నో రకాల పోటీలు జరుగుతూ ఉంటాయి. అందులో మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఎంతో ముఖ్యమైనది అని తెలిసిందే. ఈ పోటీలు ఇప్పటికే 70 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబై నగరంలో అట్టహాసంగా జరిగాయి. మరి ఈ ఏడాది ఏ దేశానికి చెందిన మోడల్ విజేతగా నిలిచింది? మిస్ ఇండియాకు ఏ స్థానం వచ్చింది? మీరే చూడండి!
71వ ప్రపంచ సుందరి (Miss World) 2024 కాంపిటీషన్ ఇండియాలోని ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ ఈవెంట్‌ను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఈ నిర్మాతతో పాటు 2013 మిస్ వరల్డ్ మేగన్ యంగ్ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 120 దేశాల నుంచి మోడళ్లు పోటీ పడ్డారు. ఈ పోటీలో అందంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడంలో సోషల్ మీడియా పాత్రపై ప్రశ్నలు అడిగారు.

తాజాగా జరిగిన మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి చెందిన సినీ శెట్టి కూడా ఉంది. ఇందులో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన 25 ఏళ్ల 'క్రిస్టినా పిజ్కోవా' అనే మోడల్ విజయం సాధించింది. తద్వారా ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. గతేడాది విజేత పోలాండ్‌కు చెందిన కరోలినా బియాలావ్‌స్కా తన వారసురాలికి కిరీటాన్ని అందజేసింది. చెక్ రిపబ్లిక్‌కు మిస్ వరల్డ్ కిరీటం రావడం ఇది రెండోసారి. ఇక, లెబనాన్‌కు చెందిన 'యాస్మినా' మొదటి రన్నరప్‌గా నిలిచారు.
71వ మిస్ వరల్డ్ పోటీలో ఇండియా నుంచి సినీ శెట్టి (Sini Shetty) ప్రాతినిధ్యం వహించారు. కర్ణాటకకు చెందిన సినీ శెట్టి ముంబైలో పెరిగింది. 2022లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న సినీ శెట్టి.. ఈ ప్రపంచ సుందరి పోటీలో టాప్ 8 వరకు చేరుకున్నారు. కానీ ఆ తరువాత టాప్ 4 కంటెస్టెంట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వలేక అందల పోటీ నుంచి వెనుదిరిగారు.

గతంలో ఇండియా ఆరుసార్లు మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. రీటా ఫరియా (1966), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (1994), డయానా హేడెన్ (1997), యుక్తా ముఖీ (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017). ఇదిలా ఉండగా.. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వచ్చిన నీతా అంబానీకి మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందించారు.


Click it and Unblock the Notifications











