ఆ హడావుడి లేకుండానే దమ్ము ఆడియో
ఈ మధ్య ఏ హీరో సినిమా తీసుకున్నా...ఆడియో విడుదల దగ్గర నుంచి సినిమా విడుదలయ్యే వరకు ప్రోమోలతో మీడియాలో తెగ హడావుడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'దమ్ము' విషయంలో అలాంటి హడావుడికి దూరంగా ఉండాలని నిర్ణయించారు దర్శక నిర్మాతలు. మార్చి 29న 'దమ్ము' ఆడియో వేడుక హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఆడియో వేడుకకు ముందు టీవీల్లో ప్రోమోలు వదిలి ఊదరగొడుతుంటారు. అయితే దమ్ము ఆడియో విడుదల సందర్బంగా అలాంటివేమీ లేకుండా నేరుగా ఆడియో విడుదల చేయాలని నిర్ణయించారు. నేరుగా ఆడియో వేడుకలో పాటలను ప్రదర్శించడం ద్వారా అభిమానులు థ్రిల్ అవుతారని, దమ్ము ఆడియో చూసిన తర్వాత తమ నిర్ణయం సరైనదే అని అంతా ఒప్పుకుంటారనే ధీమాతో ఉన్నారట దర్శక నిర్మాతలు.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక రొమాన్స్ చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు, భాను ప్రియ, శుభలేఖ సుధాకర్, వేణు తొట్టెంపూడి, అభినయ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











