దసరాకి ఈ రెండు పెద్ద సినిమాలూ ఖరారు
హైదరాబాద్ : త్వరలో దసరా హడావిడి మొదలుకాబోతోంది. దసరా శెలవులను తమ సినిమాలతో కలర్ ఫుల్ గా చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే నాగార్జున 'డమరుకం' , పవన్ కళ్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాలు మాత్రమే ఈ దసరాకు విడుదల అవుతున్నాయి. మరికొన్ని చిన్న సినిమాలు ఉన్నా వారం తేడాలో వచ్చే ఈ రెండు సినిమాలే మాగ్జిమం ధియోటర్స్ లో ప్రేక్షకుడుకి కనపించి అలరించనున్నాయి.
నాగార్జున దసరాకి 'డమరుకం' ఓ రేంజిలో మోగించబోతున్నారు. అనూష్క హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ట్రైలర్స్ ఇప్పటికే రిలిజ్ అయ్యి అంతటా మంచి టాక్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఆడియోలో సక్కుబాయి అంటూ ఛార్మి చేసిన ఐటం సాంగ్ కు మంచి క్రేజ్ వచ్చింది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్ ఎఫెక్ట్స్‌కి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతిక విభాగంలో విదేశీ నిపుణుల సహకారం కూడా తీసుకొన్నారు. ''సాంకేతికంగా ఉన్నత విలువలతో తీర్చిదిద్దిన సినిమా ఇది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. పతాక సన్నివేశాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి'' అని దర్శకుడు శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఈ సినిమా దసరాకి సందడి చేయనుంది. ఈ సీజన్‌లో ముందు వచ్చే చిత్రమిది. అక్టోబరు 11న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
ఇక రీసెంట్ గా 'గబ్బర్‌సింగ్'తో అభిమానుల్ని అలరించిన పవన్‌కల్యాణ్ ఈసారి రాంబాబుగా తెర మీదికొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్స్, సాంగ్ టీజర్స్ కూడా అబిమానుల్లో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాని అక్టోబరు 18న విడుదల చేస్తారు. 'డమరుకం', 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలు రెండూ వారం రోజుల వ్యవధిలోనే ప్రేక్షకులను పలకరించనున్నాయి. దసరా సెలవుల్లో ఈ రెండు చిత్రాలు సందడి చేస్తాయి. ఆ తరవాత దీపావళి సీజన్ మొదలవుతుంది.
డబ్బింగ్ చిత్రాల తాకిడి తెలుగు సినిమాకి ఎప్పుడూ ఉంటుంది. ఈ పండుగ సీజన్‌లోనూ కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సూర్య 'బ్రదర్స్', విజయ్ 'తుపాకీ', 'శివాజీ త్రీడీ' సినిమాలు వస్తాయి. సూర్య అవిభక్త కవలలుగా నటించిన చిత్రం 'బ్రదర్స్'. కె.వి.ఆనంద్ దర్శకుడు. ఇది దసరా సమయంలోనే విడుదలవుతుందని తెలిసింది. విజయ్, మురుగదాస్‌ల కలయికలో రూపొందుతున్న చిత్రం 'తుపాకీ'. ఇది దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రజనీకాంత్ 'శివాజీ'ని త్రీడీలోకి మార్చారు. ఈ సినిమాను అక్టోబరు, నవంబరుల్లోనే తెర మీదకు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











