రాష్ట్ర విభజనే దాసరి సినిమాని ఆపేసింది
హైదరాబాద్: రాష్ట్ర విభజన కొన్నిటికి ప్లస్ అయితే మరికొన్నింటికి ఇబ్బందులు తీసుకువచ్చింది. దాసరి నారాయణరావు చేద్దామనుకున్న చిత్రం ఆపేసే పరిస్ధితి తీసుకు వచ్చింది. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఆయన ఆ మధ్యన ఆర్బాటంగా ప్రకటించిన చిత్రం స్క్రిప్టు ఇప్పుడు పనికిరాదని ప్రక్కన పెట్టేసారు. దాసరి మాట్లాడుతూ... గతేడాది నేను ప్రకటించిన 'వడ్డికాసులవాడు' స్క్రిప్ట్ ఇప్పుడు పనికిరాదు. రాష్ట్ర విభజనకు ముందు చేయాల్సిన స్క్రిప్ట్ అది అన్నారు. ఈ రోజు దాసరి పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.
దాసరి మాట్లాడుతూ... 'వడ్డీకాసులవాడు' అనే సినిమా తీద్దామనుకొన్నా. స్క్రిప్టు కూడా సిద్ధమైంది. అయితే ఆ తరవాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఈ దశలో ఆ కథ కరెక్ట్ కాదు. అందుకే దాన్ని పక్కన పెట్టా. 'పితృదేవోభవ' అనే మరో సినిమాని ప్రారంభిస్తున్నా అన్నారు.

ప్రస్తుత సినిమాల కలెక్షన్ల పరిస్ధితి విశ్లేషిస్తూ... సినిమా హిట్ టాక్ తెచ్చుకొంటోంది. కానీ నాలుగోరోజే వసూళ్లు పడిపోతున్నాయి. కారణం ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నాం.. అందుకే వసూళ్లు మూడు రోజులకే పరిమితం అవుతున్నాయి అని నిర్మాతలు చెబుతున్నారు. అది కొంత వరకూ కరక్టే. కానీ 'ఒసేయ్ రాములమ్మా'ని తొలుత 120 థియేటర్లలో విడుదల చేశాం. రెండోవారంలో థియేటర్ల సంఖ్య నాలుగొందలకు పెరిగింది. చివరికి 200 థియేటర్లలో వంద రోజులు ఆడింది. 100 థియేటర్లలో రెండొందల రోజుల పండగ జరుపుకొంది. మరి మిగతా సినిమాలు అలా ఎందుకు ఆడడం లేదు? వసూళ్లు రావాలంటే కథలో దమ్ముండాలి కదా? అన్నారు.
ఇప్పటి నిర్మాతలు గురించి మాట్లాడుతూ...''ఇప్పటి నిర్మాతలు కథేమిటి అని అడగడం లేదు. బడ్జెట్ ఎంత? అనే అడుగుతున్నారు. వాళ్లకు హై బడ్జెట్ సినిమాలు కావాలి. దానికోసం పరాయి రాష్ట్రాల నుంచీ నటీనటుల్ని దిగుమతి చేసుకొంటున్నారు. ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నా వారికి అవసరం లేదు. నాగినీడులో ఓ నటుడున్నాడని ఎలా తెలిసింది? వెదికి పట్టుకోవాలి కదా? మురళీ మోహన్‌నో, శరత్‌బాబునో పెట్టుకొందాం అంటే.. 'మరీ పాత వాసన కొడుతోందండీ..' అంటారు. అలా ఉంది ఈవాళ్టి సినీ ప్రపంచం'' అన్నారు.
చిన్న సినిమాల పరిస్థితి గురించి చెప్తూ...ప్రేమకథా చిత్రమ్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఉయ్యాల జంపాలా.. ఇవే కదా ఆడిన సినిమాలు? ఈ సినిమాలకూ వెనుక నిర్మాతల అండదండలున్నాయి. ఉయ్యాల జంపాలకి నాగార్జున, సురేష్‌బాబుల సహకారం ఉంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కిరణ్ సినిమా. ఆ సినిమాల్ని ప్రమోట్ చేసుకోగలిగిన సత్తా వాళ్లకుంది. కానీ మిగతా సినిమాల పరిస్థితేంటి? వారానికి నాలుగైదు చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటి వల్ల ఎవరికి ఉపయోగం? రెండు పెద్ద సినిమాల మధ్య విరామంగా చిన్న సినిమా వస్తోందంతే! అలాగని పెద్ద సినిమాల పరిస్థితీ ఏం బాలేదు. ఎంత పెద్ద హిట్టయినా ప్రొడక్షన్ కాస్ట్ దక్కడం లేదు. కాస్ట్ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నారు.


Click it and Unblock the Notifications











