నయనతారపై దాసరి, ఎస్పీ బాలు కామెంట్స్
నయనతార ఇక వివాహం చేసుకుని సిని నటన జీవితానికి స్వస్ధి పలకటానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన శ్రీరామరాజ్యం చిత్రమే చివరి చిత్రమనే కూడా అప్పట్లో వినిపించింది. ఈ విషయం మరో మారు 'శ్రీరామరాజ్యం' 50 పంక్షన్ లో ప్రస్దావనకు వచ్చింది. ఆ పంక్షన్ కి హాజరైన దాసరి మాట్లాడుతూ...'ఇక నటించకూడదని నిర్ణయించుకున్నావని మీడియా ద్వారా తెలుసుకున్నాను. కానీ నువ్వు చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. పెళ్లయిన తర్వాత కూడా సావిత్రి, జమున, జయసుధ...లాంటి నటీమణులు అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించారు. వారిలాగే నువ్వు కూడా గొప్ప పాత్రలు చేయాలి. బాలకృష్ణ గొప్ప గొప్ప పాత్రలతో ఇంకా ముందుకెళుతున్నారు. ఆయనకు నీలాంటి నటి కావాలి'' అని దాసరి అన్నారు.
ఆ వెంటనే అదే పంక్షన్ కి హాజరైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పందిస్తూ... ''నయనతారకు నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే. అమ్మా...నువ్విక నటించొద్దు. ఇంతకంటే గొప్ప కేరక్టర్ నువ్వు మళ్లీ చేయలేవు. బాపూగారిలాంటి దర్శకుడు నీకు మళ్లీ దొరకడు. మళ్లీ సినిమాల్లో నటించి, నీ కీర్తిని తగ్గించుకోవద్దు'' అన్నారు. నయనతార, బాలకృష్ణ సీతారాములుగా బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబు నిర్మించిన 'శ్రీరామరాజ్యం' అర్ధ శతదినోత్సవ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో నయనతారను ఉద్దేశించి దాసరి, బాలు పై విధంగా వ్యాఖ్యానించటం అందరిలో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











