'బాలయ్యలోని ఓ మహానటుడిని ఆవిష్కరించా!': దాసరి
బాలయ్యలోని ఓ మహానటుడిని ఆవిష్కరించిన తృప్తి ఈ సినిమాతో నాకు కలిగింది. అనుకొన్న సమయంలో అనుకొన్న బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేశాం. ఒక మంచి కథలో నటిస్తే చూడ్డానికి మేం సిద్ధంగా ఉన్నామని సింహాతో రుజువు చేశారు ప్రేక్షకులు. పరమవీర చక్ర గురించి ఇప్పుడు నేనేమీ మాట్లాడను. నా సినిమానే మాట్లాడుతుంది...అంటున్నారు దాసరి నారాయణరావు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో పాటలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా దాసరి ఇలా స్పందించారు.
అలాగే..."పరమవీర చక్ర చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే...నేను పెద్దాయన ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లే అనిపించింది. ఇందులో బాలకృష్ణ విశ్వరూపాన్ని చూస్తారు. దర్శకుడికి ఆయన ఇచ్చే గౌరవం అంతా కాదు. ఒక మంచి విద్యార్థిలా ఉంటాడు. ఎన్టీఆర్‌లోని క్రమశిక్షణ నేను బాలకృష్ణలో చూశాను" అన్నారు.
"సింహా గర్జన తర్వాత వస్తున్న విజయ సింహ గర్జన ఇది. ఎన్టీఆర్‌తో ఆరు సినిమాలు రూపొందించాను. అందులో నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకొనే చిత్రాలు బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు. ఎన్టీఆర్ నా రాజకీయ జీవితానికి కారణమైన చిత్రాలు ఆ రెండు అని ఎప్పుడూ చెప్పేవారు. ఒక దర్శకుడిగా నాకు అంతకంటే ఆనందం మరొకటి లేదు. బాలకృష్ణతో కలిసి ఇప్పటి వరకూ ఎందుకు సినిమా చేయలేదో? అది నా 150వ సినిమాతోనే ఎందుకు కుదిరిందో...నాకు ఇప్పుడు అర్థమవుతోంది అన్నారు.
దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'పరమవీర చక్ర' లో బాలకృష్ణ హీరోగా నటించారు. అమీషా పటేల్, నేహా ధూపియా, షీలా కథానాయికలు. సి.కల్యాణ్ నిర్మాత. మణిశర్మ స్వరాలు సమకూర్చారు.


Click it and Unblock the Notifications











