రామ్ మోస్ట్ ఎనర్జీటిక్ హీరో: దాసరి
నేటి హీరోల్లో రామ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో అని సీనియర్ డైరెక్టర్ దాసరి నారాయణరావు అన్నారు. తొలి చిత్రం 'దేవదాసు'లోనే రామ్ పరిణతి చెందిన నటన ప్రదర్శించాడనీ, ప్రతిభకు తోడు కృషి, పట్టుదల వల్లే అతను విజయాలు సాధిస్తున్నాడని ప్రశంసించారు. రామ్, తమన్నా జంటగా రూపొందిన 'ఎందుకంటే ప్రేమంట!' ఆడియో సీడీల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
"దర్శకుడు కరుణాకరన్ ప్రేమకథలు తీస్తూ వస్తున్నాడు. నా కాంపౌండులోనే తొలిసారి అప్రెంటీస్‌గా అడుగుపెట్టి నా చేతుల మీదుగా అడ్వాన్స్ తీసుకున్నాడు. తమిళ బిడ్డయినా తెలుగు సినిమా దర్శకుడిగా నిలబడాలనుకున్నాడు. తమన్నాలో సినిమా సినిమాకీ పరిణతి కనిపిస్తోంది. హీరోలకి ఆమె ఎస్సెట్ అవుతోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. రవికిశోర్ చాలా నిబద్ధతతో సినిమాలు తీసే నిర్మాత'' అని ఆయన చెప్పారు.
స్రవంతీ మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో సీడీలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్‌కుమార్ సంగీతం సమకూర్చారు. రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి పాటలు రాశారు. ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ ఏడెకరాల స్థలంలో జరిగిన కార్యక్రమంలో హీరో రవితేజ ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి ప్రతిని సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు అందజేశారు.
రవితేజ మాట్లాడుతూ "కచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్టవుతుంది. రామ్ బెస్ట్ యాక్టర్. కరుణాకరన్‌ను సినిమా చేద్దామని ఎప్పట్నించో అడుగుతున్నా'' అన్నారు. మనకున్న బహు కొద్దిమంది దర్శకుల్లో కరుణాకరన్ ఒకరనీ, బన్నీలోని ఎనర్జీని గుర్తుకు తెచ్చే హీరో రామ్ అనీ అల్లు అరవింద్ చెప్పారు. రామ్ మాట్లాడుతూ "ఇది నాకు వెరీ స్పెషల్ ఫిల్మ్. నా ప్రాణం పోయేంతవరకూ అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా. కరుణాకరన్, తమన్నా వంటివాళ్లతో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది'' అన్నారు. తమన్నా మాట్లాడుతూ "ఈ సినిమాతో నా కల నిజమైనట్లుంది. కరుణాకరన్‌తో పనిచేయాలనేది ఎప్పట్నించో నాలో ఉన్న కోరిక.
రామ్‌తో ఇదివరకు 'రెడీ'లో ఓ చిన్న పాత్ర చేశా. ఇందులో హీరోయిన్‌గా చేయడం హ్యాపీ. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ చాలా బాగుంది'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్రవంతి రవికిశోర్, బ్రహ్మానందం, కరుణాకరన్, శ్రీను వైట్ల, బొమ్మరిల్లు భాస్కర్, గోపీచంద్ మలినేని, సంతోష్ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, శ్రియ, బూరుగుపల్లి శివరామకృష్ణ, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కోన వెంకట్, జీవీ ప్రకాశ్‌కుమార్, బండ్ల గణేశ్, రామజోగయ్యశాస్త్రి, ఆదిత్య దయానంద్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











