'ఆటోనగర్ సూర్య'పై ఈ రోజే కోర్టు లో...
హైదరాబాద్ : నాగచైతన్య నటించిన 'ఆటోనగర్ సూర్య' చిత్రం విడుదల ఆపాలంటూ కోర్టుకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే నిర్మాతలు ఎలాగైనా చిత్రాన్ని ఇచ్చిన తేదీ ప్రకారం అంటే రేపు రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపధ్యంలో విడుదలపై గుంటూరు న్యాయస్థానం ఇచ్చిన నిలుపుదల ఉత్తర్వులను సవాలు చేస్తూ చిత్ర నిర్మాత, మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అధినేత అచ్చిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరి అప్పారావు గురువారం ఉత్తర్వులు వెల్లడించనున్నట్లు చెప్పారు. న్యాయమూర్తి ఏం తీర్పు చెప్పనున్నారో, రేపు విడుదల అవుతుందో లేదో అని చిత్రానికి సంభందించిన యూనిట్ వారు టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు.
జులై 10వ తేదీ వరకు చిత్ర విడుదలను నిలిపివేయాలని గుంటూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిత్ర నిర్మాణానికి తన వద్ద రూ.2కోట్లు రుణం తీసుకున్నారని, అది తీర్చకపోగా పంపిణీ హక్కులు కూడా ఇవ్వలేదని ఆరోపిస్తూ.. గుంటూరుకు చెందిన ఎంరాల్ ప్రాజెక్టు యజమాని మహ్మద్ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు చిత్ర విడుదలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది.

నిర్మాత మాట్లాడుతూ ''నాగచైతన్య పాత్ర ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అనూప్ చక్కటి స్వరాలందించారు. నాగచైతన్య కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్టవుతుంది. అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. అనూప్ రూబెన్స్ చాలా చక్కని స్వరాలు కూర్చారు. ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా సినిమా వచ్చింది'' అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ''సమాజంలో చెడుని అంతం చేయాలి అని అందరూ అంటుంటారు. కానీ ముందుకు రారు. అలా వచ్చిన యువకుడి జీవితమే మా సినిమా'' అన్నారు.ఆటోనగర్ ప్రాంతంలో అతడు ఏం చెప్తే అది జరగాల్సిందే.. కారణం అతడంటే భయం కాదు. ఆ యువకుడి మాటపై గురి అలాంటిది. పేదల పక్షాన నిలబడి ఎవరినైనా... ఎంతటి వారినైనా ఎదిరించే ఆ కుర్రాడి కథే మా సినిమా అంటున్నారు.
. 'ఏం మాయ చేశావే' వంటి హిట్ సినిమా తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ఇదే. కిమాయా, బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, అజయ్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.


Click it and Unblock the Notifications











