twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినిమాల్లో దీపావళి

    By Srikanya
    |

    Deepavali celebrations in Telugu Film
    తెలుగు సినిమా ప్రజల జీవితాన్ని దాటి ఎప్పుడో వెళ్లిపోయింది అన్నది వాస్తవమే అయినా, ప్రక్కనున్న వారిని చూసి ప్రేరణ పొందే మనం వారు తమ సినిమాల్లో సంస్కృతి… సంద్రాయాలకు ఇస్తున్న ప్రాధాన్యత మనమెందుకు ఇవ్వటం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పండుగ పూట మనని మనం తిట్టుకోవటంకన్నా… మనకున్నంతలో మనవాళ్ళు గతంలో తీసిన సినిమాల్లోని పండుగలకు… ముఖ్యంగా దీపావళికి ఇచ్చిన ప్రాధాన్యత గుర్తు చేసుకోవటం బెస్ట్ కదా.

    కాస్త వెనక్కి వెళ్లి… 'షావుకారు" (విజయవారి తొలి చిత్రం)లో సీన్ గుర్తుకు చేసుకుంటే… దీపావళి పండుగనాడు శాంతమ్మ (శాంతకుమారి) సుబ్బులు (జానకి) ఎంతో ఆత్మీయంగా, ఆనందంగా ''దీపావళి, దీపావళి… ఇంటింట ఆనంద దీపావళి… మా యింట మాణిక్యావళి"" అంటూ పాడుతుంది. అలాగే అంతా కలిసి ఉన్నప్పుడు పాడుకునే ఆ పాటని సెకండాఫ్‌లో గొడవలు వచ్చి విడిపోయినప్పుడు ''దీపావళి, మా యింట శోకాంధ తిమిరావళి"" అంటూ చూపటం ద్వారా ఓ సింబాలిజంలా వాడుకున్న తీరు మైమరిపిస్తుంది. నిజానికి ఇలాంటి స్క్రీన్‌ప్లే స్క్రీమ్‌లు అప్పట్లో చాలా సినిమాల్లో కనిపిస్తాయి.

    'పెళ్లికానుక" సినిమాలోనూ మొదట… 'దీపావళి" పండుగ చేసుకుంటూ ఆనందంగా హీరో హీరోయిన్స్… 'ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడ ఆనందం పొంగేనోయి దీపావళి, ఇంటింట వెలుగు, దీపాల మెరుగు, ఎనలేని వేడుకరా" పాడుకుంటారు. అదే సీన్ రివర్స్ అయినప్పుడు ఆ బాధను స్ఫురింపజేస్తూ… 'ఆడే పాడే పసివాడ, అమ్మాలేని నినుచూడ కన్నీటి కథ ఆయె దీపావళి, ఊరెల్ల వెలుగు, ఆనందం కనరాని దూరమురా" అంటూ రిపీట్ అవుతుంది. అంటే ఆ దీపావళికి ఈ దీపావళి ఇలాంటి మార్పు వచ్చిందిని దర్శకుడు భావనాత్మకంగా చెప్పారన్నమాట. దీపావళి అనేది జీవితంలోని వెలుగు నీడలకు ప్రతీక అని దర్శక, రచయితల అభిప్రాయం అయ్యుండొచ్చు.

    ఇక ఈ రోజు (దీపావళి)… టీవీ వాళ్ళు, రేడియో వాళ్ళు తప్పనిసరిగా వేసే పాట ఒకటుంది. నిజానికి ఆ పాటని దీపావళి గీతంగా గవర్నమెంటు ప్రకటించేవచ్చు. అదే… ''చీకటి వెలుగుల రంగేళి… జీవితమే ఒక దీపావళి… మన జీవితమే ఒక దీపావళి… అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాలవేళ"" అంటూ సాగే పాట. విచిత్ర బంధం (1972) చిత్రంలోని ఈ పాట తెలుగువారు ఉన్నత కాలం ఉంటుందనేది అందరూ ఒప్పుకుని తీరే సత్యం. ఇక 'భలే రాముడు" క్లైమాక్స్‌లో సావిత్రి 'ఇంటింటను దీపావళి మా ఇంటను లేదా, ఆ భాగ్యము రాదా" పాట, 'రుణానుబంధం"లోని 'వచ్చింది దీపాల పండుగ ఉన్నోళ్ళ డబ్బంతా దండుగ" పాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోతగ్గవే. ఇవన్నీ మనవైన మన పండుగ పాటలు.

    ఆ తరం నుంచి ముందుకు వస్తే దాసరి నారాయణరావు 'మామగారు' చిత్రంలో 'వెయ్యేళ్ల నిత్యమైన దీపావళి… ఏనాడూ వెళ్లిపోని దీపావళి… ఏరికోరి ఎంచుకుంది మా లోగిలి"" అంటూ ఓ పాట దీపావళి పండుగ నేపథ్యంలో కొత్త అల్లుడుతో ఆనందంగా పాడుకోవటం కనిపిస్తుంది. సినిమాలాగే ఆ పాట కూడా తెలుగునాట ఓ భాగమై కలిసిపోయింది. అలాగే చిరంజీవి 'ఠాగూర్" ప్ల్యాష్‌బ్యాక్ ఎపిసోడ్ (గుర్తొచ్చిందా)లో అపార్టుమెంట్ కూలిపోయే ముందు దీపావళి జరుపుకుంటూ ఓ చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. ఇక సూపర్ డూపర్ హిట్ 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి" చిత్రంలోనూ దీపావళితో ముడిపెట్టి ఓ కీలకమైన సన్నివేశం ఉంటుంది. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శ్రీకాంత్ కలిసి తమ పెళ్లాల దగ్గర బిల్డప్ ఇవ్వటానికి అప్పుచేసి దీపావళి సామాను తెస్తారు. ఆ తర్వాత ఆ అప్పే వారిని రోడ్డుమీద పారేసేందుకు లీడ్ అవుతుంది. ఇక రెండు మూడేళ్ల క్రితం వచ్చిన కళ్యాణ్‌రామ్… 'విజయదశమి" చిత్రంలోనూ దీపావళిపై పాట వుంటుంది. అయితే పెద్ద ట్విస్టు ఏమిటంటే ఈ పైన చెప్పుకున్న చిత్రాలన్నీ తమిళ రీమేక్‌లే. అక్కడ వారు తమ సంస్కృతిలో భాగమైన దీపావళిని వదలలేదు కాబట్టి మనకూ ఆ మాత్రం దీపావళి సోయగాలన్నా దక్కాయి. ఇలాంటప్పుడే తమిళ రీమేక్ లకు జై అని అనాలని తెలుగువారికి అనిపిస్తుంటుంది.

    సినిమా చూస్తున్న ప్రేక్షకుడుకి ఇది నా కథ, నాకు తెలిసిన వారి కథే. నా జీవితమే అనిపించాలంటే… ఇలాంటి పండుగలను కలపడం వంటి కొద్దిపాటి జాగ్రత్తలు తప్పనిసరేమో. కాబట్టి దీపావళి కూడ కమర్షియల్ ఎలిమెంటే. అయినా మన తెలుగు హీరో ఇప్పుడు మాఫియో డానో, హిట్ మ్యానో అవుతున్న నేపథ్యంలో ఈ పండుగలు పెట్టడం కష్టమే. అయినా ఇలా దీపావళి సీన్ పెట్టిన సినిమాలువల్ల అప్పుడప్పుడూ చూసే జనానికి లాభాలు కూడా కలుగొచ్చు. ఉదాహరణకి… 'ఫ్యామిలీ సర్కస్" సినిమాలో దీపావళి జరుగుతూంటే… ఆ ప్రేలుళ్ల శబ్దానికి జగపతిబాబుని ఓ టీనేజ్ అమ్మాయి వాటేసుకుంటుంది. ఇలా దీపావళి ఒక్కోసారి మగవాళ్లకు చాలా ఉపయోగపడుతుందనే విషయం ఈ సీన్ చెప్తుంది. అయితే అక్కడినుంచి ఈ మధ్య వయస్కుడిని అమ్మాయి ప్రేమించానంటూ వెంటబడి కాపురంలో నిప్పులు పోసే సీన్‌కూడా ఉందనుకోండి.

    ఇక దీపావళి ఒక వ్యక్తి జీవితాన్ని ఓ భయంకరమైన మలుపు ఎలా త్రిప్పుతుందో… 'దొంగరాముడు"" చిత్రంలో గమనించవచ్చు. రాము (అక్కినేని), లక్ష్మీ (జమున) అన్నా చెల్లెళ్ళు. చెల్లెలంటే ఎంతో ప్రేమ ఉన్న రాము… దీపావళి పండుగ రోజున చెల్లికి ఆనందం కలిగిస్తాడు. ఆ టపాకాయల చప్పుడుతో తల్లి షాక్‌కు గురవుతుంది. తల్లి ఆరోగ్యంకోసం మందులు దొంగిలించిన నేరానికి పోలీసులు రామును అరెస్టుచేసి బాల నేరస్థుల జైలుకు పంపుతారు. ఆ తర్వాత అతనే దొంగరాముడై సినిమా చూసిన వారి హృదయాలను దొంగిలిస్తాడు.
    'దీపావళి" టైటిల్‌తోఇప్పటికి రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటిది దీపావళి (1960) 'దీపావళి" అంటే ఏమిటీ ఎలా ఆ పురాణ కథ చెప్పేది అయితే మరొకటి… వేణు హీరోగా వచ్చిన దీపావళి (2008) ఓ ప్లాప్ సినిమా.

    చివరగా దీపావళి (1960) చిత్రంలోని హైలెట్‌గా నిలిచిన డైలాగ్…
    సత్యభామ: ఛీ నీచాధమా; పరస్ర్తిలను మాతృసమాన పూజ్యులు. పతివ్రతలు పరాశక్తిస్వరూపిణులు, ఆ పవిత్ర సత్యాన్ని పాటించక పాపచింతనతో పతితుడవైనప్పుడు ఆ మాతృస్వరూపం సంక్షిభించి అగ్నిపర్వతంవలె బ్రద్ధలై భయంకర కోపాగ్ని కీలలు నిన్నావరించి దహించునప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులేకమై వచ్చినా నిన్ను రక్షించలేరు. నీతో భూదేవి కృంగిపోతున్నది. నిన్ను వధించి భూభారం తొలగిస్తారు. కాచుకో. ఓరీ మదోన్మాదీ! నీకు చావు తప్పదుఅని హెచ్చరిక చేస్తుంది.

    అదే విధంగా తెలుగు పరిశ్రమలో కూడా విలువలు పాటించకుండా సినిమాలు తీస్తున్న వారు, సినిమా అంటే అవగాహన లేని వారందరూ నరకాసురులే. ఈ సినీ నరకాసరుల వధ జరిగి మంచి సినిమాలు రావాలంటే ప్రేక్షకులే సత్యభామ, కృష్ణుల అవతారమెత్తాలి. ఆల్రెడీ అవతారమెత్తిన వారు యుధ్దం ప్రారంభించే సమయం ఆసన్నమైందని తెలుసుకోవాలి. ఇక ఈ పండుగ పూటనుంచైనా మన దర్శక, నిర్మాతలు… “మనం తెలుగు సినిమాను కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే తీస్తున్నాం" అనే విషయం గుర్తుచేసుకుని ముందుకెళ్తారని, స్క్రిప్టులో మసాలా జోడించినట్లే కాస్త మన పండుగలు, సంప్రదాయాలని కలిపి మనదైన సినిమాని మనకు అందిస్తారని ఆశిద్దాం. పండుగ పూట ప్రార్ధిద్దాం.

    English summary
    We can see Deepavali importance in Telugu films. The celebrations are projected in films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X