సూపర్ స్టార్ సరసన దీపికా పదుకోని ఖరారు
మొత్తానికి దీపికా పదుకోని సూపర్ స్టార్ ప్రక్కన చేయటానికి ఓకే అంది. రజనీకాంత్ 'కొచ్చాడయాన్'అనే ఓ త్రీడీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో మొదట దీపికాని అనుకున్నా తర్వాత లేటవటంతో ఆమె ఒప్పుకోలేదు. దాంతో కత్రినాకైఫ్ ని ఆ ప్రాజెక్టులోకి తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అనుకోని విధంగా దీపిక మళ్లీ తానే ఈ ప్రాజెక్టులో చేయటానికి ముందుకొచ్చింది. ఈ విషయాన్ని రజనీకాంత్ కూతురు ట్వీట్ చేస్తూ...దీపిక పదుకోని మా నాన్న చిత్రంలో చేయటానికి ఓకే అంది. ఆమె తన కాదనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రావటం చాలా ఆనందంగా ఉంది..ఆమెకు బిగ్ హగ్ అంటూ పోస్ట్ చేసి రజనీకాంత్ అభిమానుల్లో ఆనందం నింపింది.
తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రం పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఫెర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ పరిజ్ఞానంతో ఈ సినిమాను త్రీడీలో చిత్రిస్తారు. 2012 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్', 'ద అడ్వెంచర్ ఆఫ్ టిన్‌టిన్' తరహాలో తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇక 'రాణా'సినిమా రజనీకాంత్ చేయాలని ఆయన అనుకున్నా హెల్త్ సమస్యలతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు పట్టాలు ఎక్కి విజయవంతంగా ముందుకు వెళ్తోంది.


Click it and Unblock the Notifications











